ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీకి నమస్కారం పెడతారా...? లేక కమలంతో కలిసి నడుస్తారా? అన్నది నేడు తేలనుంది. చంద్రబాబు రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన గతకాలంగా అసహనం వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. పోలవరం విషయంలోనూ, రాష్ట్ర బీజేపీ నేతల వ్యాఖ్యలపైన కూడా చంద్రబాబు బీజేపీ అధినాయకత్వంపై కొంత గుర్రుగానే ఉన్నారు. ఇన్నాళ్లూ సహనం పాటించిన చంద్రబాబు ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారన్నది పార్టీ వర్గాల టాక్. ఆదివారం జరగబోయే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అమరావతి నుంచి అందిన సమచారం ప్రకారం తెలుస్తోంది.
కొంతకాలంగా అసహనంతో....
గతకొంతకాలంగా కేంద్రంతో చంద్రబాబుకు సత్సంబంధాలేమీ లేవు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో మాత్రం ప్రధాని మోడీ స్వయంగా ఫో్న్ చేసి మద్దతు కోరారు.అంతేతప్ప అంతకు మించి బాబుకు కేంద్రంలో పెద్దగా ప్రయారిటీ లేదన్నది అందరికీ తెలిసిన సత్యమే. అయితే రాష్ట్ర ప్రయోజనాలు, విభజన హామీలు, పోలవరం వంటి విషయాల కోసం చంద్రబాబు బలవంతపు కాపురం ఇన్నాళ్లూ చేశారన్నది టీడీపీ వర్గాల అభిప్రాయం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎంతో కొంత ప్రయోజనం చేకూరాలంటే కేంద్రంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉండాలని చంద్రబాబు ఆలోచించారు. అందుకోసమే రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా టీడీపీ నేతలు కయ్యానికి దిగకుండా అడ్డుకున్నారు.
ఇబ్బందుల్లో టీడీపీ....
అయితే తాజా బడ్జెట్ వచ్చిన తర్వాత టీడీపీపైనా, చంద్రబాబుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రానికి పైసా విదల్చని కేంద్రంతో ఇంక పనేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రత్యేక హోదా సమయంలోనే గట్టిగా ఉంటే అది వచ్చేదని, చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే బీజేపీతో సఖ్యతగా ఉన్నారని సీపీఎం జాతీయ నేత రాఘవులు సయితం గొంతెత్తారు. కేంద్ర మంత్రివర్గంలో ఉండి ఎన్డీఏ సమర్పించిన బడ్జెట్ కు తమకు సంబంధం లేదంటే ఎలా అని కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. బడ్జెట్ ను కేబినెట్ ఆమోదించినప్పుడు టీడీపీ మంత్రులు ఏం చేస్తున్నారని కొందరు నిలదీస్తున్నారు.
నేడు తేల్చేస్తారా?
ఈనేపథ్యంలో ఈరోజు పార్లమెంటు సభ్యులతో చంద్రబాబు సమావేశం కీలకంగా మారనుంది. అయితే టీడీపీలో కొందరు మాత్రం బీజేపీతో కలసి వెళ్లాలని సూచిస్తున్నారు. మరోసారి మోడీ ప్రధాని అవుతారని, అందువల్ల సఖ్యతగా ఉంటేనే మేలని మంత్రి అయ్యన్న పాత్రుడు లాంటి వారు సూచిస్తున్నారు. మరోవైపు సీనియర్ నేతలైన గోరంట్ల తదితరులు బీజేపీతో పొత్తు వదిలేద్దామంటున్నారు. పార్లమెంటు సభ్యులు రాయపాటి, టీజీ వెంకటేశ్ సయితం పొత్తు వద్దని గట్టిగా చెబుతున్నారు. బీజేపీపై ఏపీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, కలిసి పోటీ చేస్తే తమకు కూడా ఇబ్బంది అని వారి వాదన. అయితే వీరి వాదనలు ఎలా ఉన్నా...? చంద్రబాబు ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. కేంద్రమంత్రులతో రాజీనామా చేయించి కొద్దిగా గట్టి హెచ్చరికలు బీజేపీకి పంపుతారన్న ఊహాగానాలు కూడా విన్పిస్తున్నాయి.