ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాను వదలడం లేదు. అదీ ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గం మీద అమితప్రేమను చూపిస్తున్నారు. తనకు కష్టకాలంలో ఆదుకున్న నంద్యాల నియోజకవర్గానికి ఏం చేసినా తక్కువేనన్న రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. నంద్యాల ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గానికి 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మంజూరు చేశారు. నంద్యాలలో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పేదలకు సొంత గృహాలను మంజూరు చేశారు. అయితే తాను మంజూరు చేసిన అభివృద్ధి పనులు ఏ మేరకు జరగుతున్నాయన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫాలో అప్ చేస్తుండటం విశేషం. అంతేకాదు నంద్యాలను మోడల్ గా తీసుకుని మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదేరకంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
మెగా సీడ్ పార్కుకు శంకుస్థాపన........
అందుకే గత నెలలో నంద్యాల వచ్చి అభివృద్ధి పనులపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కర్నూలు జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా మరోసారి నంద్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. సోమవారం చంద్రబాబు పర్యటన ఉంది. ఈ సందర్భంగా చంద్రబాబు తంగడంచలో మెగాసీడ్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మెగా సీడ్ పార్క్ లో 101 రకాల విత్తనాలపై సాంకేతికంగా పరిశోథనలు జరగనున్నాయి. ఆచార్య రంగా విశ్వవిద్యాలయం, అమెరికా ఐయోవా విశ్వవిద్యాలయం సాంకేతిక సహకారంతో సీడ్ హబ్ ను నెలకొల్పుతారు. దీంతో పాటు మూడో విడత రుణమాఫీ చెక్కులను కూడా ముఖ్యమంత్రి రైతులకు అందించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మొత్తం మీద నంద్యాలను నెలకొకసారి వచ్చి అభివృద్ధి పనులను పరిశీలించడం మంచిపరిణామమేనని నంద్యాల వాసులు అంటున్నారు.