నంద్యాల ఉప ఎన్నికలు మీకు గుర్తుండే ఉంటుంది. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ ఎన్నో హామీలిచ్చింది. అందులో ఒకటి రహదారి విస్తరణ. నంద్యాలలో రహదారి విస్తరణపనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. అయితే బాధితులకు మాత్రం పరిహారం అందడం లేదు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాని ఎన్నికలు పూర్తయి ఏడాది గడుస్తున్నా పరిహారం అందక బాధితులు లబోదిబోమంటున్నారు. అందరికీ నష్టపరిహారం సమానంగా ఇవ్వడం లేదన్నది ప్రధాన ఆరోపణ.
రహదారి విస్తరణ పనుల్లో పరిహారం?
నంద్యాలలో గాంధీ చౌక్ నుంచి పద్మావతి నగర్ వరకూ 60 అడుగులు, పద్మావతి నగర్ నుంచి సాయిబాబా నగర్ వరకూ 80 అడుగులు రహదారి విస్తరణ పనులు చేపట్టారు. వేల సంఖ్యలో ఇళ్లను నేలమట్టం చేశారు. గాంధీ చౌక్ నుంచి పద్మావతి నగర్ వరకు బాధితులకు చదరపు గజం మార్కెట్ విలువ ప్రకారం 18 వేలు ఉండటంతో ప్రభుత్వం అక్కడ 45వేలుగా నిర్ణయించింది. అలాగే పద్మావతి నగర్ నుంచి సాయిబాబా నగర్ వరకూ బాధితులకు మార్కెట్ విలువ ప్రకారం 6,500లు ఉండటంతో దానిని 16,250లుగా చదరపు గజానికి నిర్ణయించారు. అయితే గాంధీ చౌక్ నుంచి పద్మావతి నగర్ వరకూ ఉన్న ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి బంధువులు ఎక్కువగా ఉండటంతోనే నష్టపరిహారం ఎక్కువగా నిర్ణయించారని ఆరోపణలు విన్పించాయి. దీనిపై ఆందోళన కూడా చేశారు. దీంతో దిగివచ్చిన అధికారులు అందరికీ ఒకే విధంగా నష్టపరిహారం అందజేస్తామని చెప్పింది.
ఇంకా అందని సాయం.....
ఇక రహదారి విస్తరణలో స్థలాలు, షాపులు కో్ల్పోయిన 69 కుటుంబాలకు మున్సిపల్ కాంప్లెక్స్ లో షాపులు ఇస్తామని హామీ ఇచ్చారు. గాంధీ చౌక్ నుంచి పద్మావతి నగర్ వరూ రహదారి విస్తరణలో 405 మంది బాథితులుంటే 184 మందికి మాత్రమే పరిహారం చెల్లించారు. మరో 35 కుటుంబాలకు ఇవ్వాల్సి ఉంది. అందుకోసం చెక్ లు రూపొందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కాని పద్మావతి నగర్ నుంచి సాయిబాబానగర్ వరకూ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇంతవరకూ పైసా కూడా నష్టపరిహారం అందించలేదు. దీనిపై ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ రహదారి విస్తరణలో 166 మంది బాధితులకు పైసా పరిహారం ఇవ్వకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు. ఇందుకోసం పోరాట కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
ఆందోళన బాటలో బాధితులు....
నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ ఇక్కడ పర్యటించి హామీలు ఇచ్చి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే హామీలను మర్చిపోయారంటున్నారు. మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఓట్ల కోసమే ఆరోజు హామీలు ఇచ్చారని, ఆ అవసరం తీరిన వెంటనే తమను పట్టించుకోవడం లేదన్నది బాధితుల ఆరోపణ. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ సమస్యలను తెలియజేయాలని వారు భావిస్తున్నారు. అలాగే విపక్ష పార్టీలను కూడా కలవాలన్నది పోరాట కమిటీ ఉద్దేశ్యం. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నికల హామీలు హామీలుగానే ఉండిపోయాయి.