జగన్ పాదయాత్ర పొన్నూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. పొన్నూరు నియోజకవర్గం అంటేనే ధూళిపాళ్ల కు మంచిపట్టున్న నియోజకవర్గం. ధూళిపాళ్ల కుటుంబానికే కాకుండా సైకిల్ పార్టీకి అండగా నిలుస్తున్న నియోజకవర్గం. జగన్ గుంటూరు జిల్లాలో ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. ఆయన బాపట్ల నియోజకవర్గం పూర్తి చేసుకుని పొన్నూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ విజయాల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. గత ఐదు ఎన్నికల నుంచి ఇక్కడ పసుపు జెండానే ఎగురుతుండటం విశేషం.
ఐదు సార్లు వరుసగా.....
పొన్నూరు నియోజకవర్గం 1955లో ఏర్పడింది. అప్పటి వరకూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీదే హవా. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మాత్రం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిపోయింది. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి 1985 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే 1989లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చిట్టినేని వెంకట్రావు విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. 1994, 1999, 2004, 2009, 2014లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర వరుస విజయాలతో దూసుకుపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గట్టి పోటీయే ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రావి వెంకట రమణకు 80625 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు 88,386 ఓట్లు వచ్చాయి. దాదాపు ఎనిమిది వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.
పాదయాత్రతో మేలు జరిగేనా?
అయితే ఐదు సార్లు వరుస విజయాలతో దూసుకుపోతున్న దూళిపాళ్లకు జగన్ తన పాదయాత్రతో చెక్ పెట్టాలని చూస్తున్నారు. దాదాపు ఇరవై అయిదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండటంతో ధూళిపాళ్లపై సహజంగా వచ్చే వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రకు వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పొన్నూరు నియోజకవర్గంలో విజయం సాధిస్తే గుంటూరు నియోజకవర్గంలోని అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో వైసీపీ ఉంది. జగన్ పాదయాత్రకు పొన్నూరులో ఎలా స్పందన లభిస్తుందో చూడాలి.
111వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర....
జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర 111వ వరోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం జగన్ బాపట్ల శివారు ప్రాంతంలో బసచేసిన శిబిరం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మూర్తి నగరం మీదుగా కొండుగట్ల పాలెం చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు భోజన విరామానికి ఆగుతారు. తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. అప్పికట్ల, పుండ్లంక్రాస్ రోడ్స్ మీదుగా ఏతూరు చేరుకుంటారు. రాత్రికి జగన్ ఏతూరులోనే బస చేయనున్నారు. జగన్ పాదయాత్ర బాపట్ల నియోజకవర్గంలో విజయవంతం అయిందని వైసీపీ నేతలు చెప్పారు.