ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం దక్షిణ కొరియాలో యాత్ర చేశారు. బాబు రైట్ హ్యాండ్ యనమల సహా ఆయన బృందం దక్షిణ కొరియా నేతలతో సుదీర్ఘంగా భేటీ అయి.. వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పిలవడం కాదు బతిమాలినంత పనిచేశారు. ఒక రకంగా తన ఇమేజ్‌ను కాపాడుకోవడం కోసం, ఏపీని తానే అభివృద్ధి చేస్తున్నానని చెప్పుకోవడం కోసం బాబు చేస్తున్న ప్రయత్నాల్లో తప్పు వెతకాల్సిన అవసరం లేకున్నా.. ఈ సందర్భంగా బాబు అక్కడి వారికి ఏపీ గురించి చెప్పిన అనేక సంగతులే ఇప్పుడు అతిశయోక్తులుగా, కట్టు కథలుగా తోస్తున్నాయని విమర్శకులు అంటున్నారు. ఏపీలో శాంతి భద్రతలకు లోటు లేదని, వనరులకు పెట్టింది పేరని, అవినీతి రహితమని, 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తామని, సంస్థల స్థాపనకు కావల్సినంత భూమి ఉందని ఇలా చెప్పుకొచ్చారు.
కియా ను చూపించి....
అయితే, ఈ విషయాల్లో చంద్రబాబు అసలు సంగతులు దాస్తున్నారని, కేవలం బిల్డప్ ఇస్తున్నారని విమర్శకులు అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. దక్షిణ కొరియా కు చెందిన కియా మోటార్స్ సంస్థ అనంతపురంలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రేపో మాపో సంస్థ తన కార్యాలయ నిర్మాణంలోపాటు పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోకియాను చూపించి దక్షిణ కొరియాకు చెందిన మరిన్ని సంస్థలను ఏపీకి తెచ్చేందుకు బాబు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే తన పరివారంతో కలిసి దక్షిణ కొరియాకు వెళ్లారు బాబు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఏపీకి రావాలని వారిని పిలవడం ఎవరూ ఎవరికీ ఆక్షేపణ లేకున్నా.. ఈ సందర్భంగా బాబు ఏపీని మరీ భారీ స్థాయిలో పొగిడేయడం, ఇక్కడ అస్సలు సమస్యలే లేవని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రండి..పెట్టుబడులు పెట్టండి....
‘నవ్యాంధ్రకు రండి! మా రాష్ట్ర అభివృద్ధి, నిర్మాణంలో భాగస్వాములు కండి. ఏపీ సామర్థ్యం, పెట్టుబడులకు ఉన్న అనుకూలత గురించి... మీ దేశానికే చెందిన కియ కంపెనీ ప్రతినిధులను అడగండి’’ అని దక్షిణ కొరియా పారిశ్రామిక వేత్తలకు బాబు చెప్పడం గమనార్హం. దక్షిణ భారత దేశంలో రహదారులు, రైలు మార్గాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాలతో అన్ని ప్రాంతాలతో అనుసంధానం కలిగిన రాష్ట్రం ఏపీ ఒక్కటే అని బూసన్ బిజినెస్ సెమినార్‌లో చంద్రబాబు ఉద్ఘాటించారు. ‘‘ఇరవై ఏళ్లక్రితం నేను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాను. జంట నగరాలకు సైబరాబాద్ అన మరొక నగరాన్ని చేర్చాను. ఆనాటి ఫలాలను ఇప్పుడు హైదరాబాద్ అనుభవిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ జీరో నుంచి నాపని మొదలైంది’’ అని చంద్రబాబు తెలిపారు.
అవినీతికి ఆస్కారమే లేదట...
అంతేకాదు, ‘‘మేం ఎంత సమర్థులమో... మా రాష్ట్రంలో వ్యాపారం ఎంత సులభతరమో మీరే వచ్చి ప్రత్యక్షంగా చూడండి’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత జవాబుదారీగల పరిపాలన కొనసాగుతోందని, అంతర్జాతీయ పెట్టుబడు లు, పరిశ్రమల స్థాపనకోసం ఓపెన్ డోర్ పాలసీని అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పడం గమనార్హం. అయితే, ఈ ఊకదంపుడు ఉపన్యాసాలపైనే లోకల్‌లో విమర్శలు వస్తున్నాయి. పారదర్శకత ఉండి ఉంటే పోలవరం పనులు ఎందుకు వివాదాస్పదం అయ్యాయి? రాజధాని భూ సమీకరణ ఎందుకు రాద్ధాంతం అయింది? తుందుర్రు ఎందుకు రావణకాష్టంగా మారుతోంది? కాపు రిజర్వేషన్ ప్రకటనలో అంత హడావుడి ఎందుకు? అసలు ఇది అయ్యే పనేనా?
గతంలో వచ్చిన సంస్థలు...
మహిళల రక్షణకు పూచీ ఏది? ఉపాధి కోసం యువత ఎందుకు అర్రులు చాస్తున్నారు? ఏపీకి హోదా వద్దని ప్యాకేజీ చాలని ప్రకటించి కూడా నిధులు రాబట్టడంలో ఎందుకు విఫలం అవుతున్నట్టు? వంటి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. మరి వీటికి బాబు ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఇక, బాబు మాటలు నమ్మి.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలు ముఖం చాటేశాయని, సేకరించిన రైతుల భూముల్లో పిచ్చి చెట్లు మొలిచి అటు వ్యవసాయానికి, ఇటు పెట్టుబడులకు అనువుకాకుండా పోయాయని బాబు అనుకూల పత్రికల్లోనే కథనాలు వస్తున్న నేపథ్యంలో బాబు ఇలా బయటడ ప్పుకొట్టుకోవడం ఏంటనే ప్రశ్నకు సమాధానం చెప్పేవారేరీ?!