దేశ రాజకీయాల్లో నాకన్నా సీనియర్ ఎవరూ లేరంటూ ఆ మధ్య చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు మంత్రి లోకేష్ బాబు తండ్రి బాటలోనే పోతున్నారు. దేశం మొత్తం మీద పంచాయితీరాజ్ శాఖకు ప్రాతినిధ్యం వహించే మంత్రి తానే జూనియర్ అని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ఉపాధి హామీ పథకంపై చర్చలో భాగంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఆమధ్య భోపాల్ పర్యటనకు వెళ్ళినప్పుడు అందరు సలహాలు కోరానని ఏపీ అంటే దేశం మొత్తం అసూయ పడేలా అభివృద్ధి నడుస్తుందన్నారు లోకేష్.
ఉపాధి హామీ బిల్లులకు వైసిపి చిల్లు పెట్టింది...
ఉపాధి హామీ పధకంలో నిధుల విడుదల వైసిపి కారణంగానే నిలిచిపోయిందని మంత్రి లోకేష్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వైసిపి ఇచ్చిన ఫిర్యాదులు అందుకుని విచారణ చేపట్టిందని దానివల్ల గ్రామాల్లో పనులు పూర్తి అయినా నిధులు రాక పేదలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రతి గ్రామం లోని వారు తమ వద్దకు వచ్చే వైసిపి వారిని ఈ అంశంలో నిలదీయన్నారు లోకేష్.. శాసన సభను వైసిపి బహిష్కరించినా సమావేశాలు మొత్తం ఆ పార్టీ చుట్టూనే టిడిపి నడిపించడం నిత్య కృత్యంగా మారింది. సభలో లేని వారిపై సభా సంప్రదాయాల ప్రకారం మాట్లాడకూడదు. అలా మాట్లాడితే సభా సమయం వృధా అవుతుంది . కానీ అధికారపక్షం విమర్శలు, ఆరోపణలు విపక్షంపై గుప్పించడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.