ఢిల్లీ లో దారుణమైన వాయుకాలుష్యం తో సుప్రీం కోర్టు కఠిన నిర్ణయాన్నే ప్రకటించింది. దాదాపు సుప్రీం నిర్ణయంతో ఏకీభవిస్తూ మహారాష్ట్ర హైకోర్టు అలాంటి ఆదేశాలే ముంబాయిలోను ప్రకటించింది. జనావాస ప్రాంతాల్లో బాణాసంచా అమ్మకాలపై నిషేధాజ్ఞలు కోర్టు లు విధించడం ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు తెరతీసేలా చేసింది. హిందువుల పవిత్ర పండుగను కోర్టు లు నియంత్రించడం ఏమిటంటూ పలువురు ప్రముఖులు ఫేస్ బుక్ , ట్విట్టర్ లలో చెలరేగిపోయారు . దీపావళికి ముందే ట్వీట్ లు పోస్ట్ చేసి టాపాసుల్లాంటి కామెంట్లను జనం మీదకు వదిలి పెట్టారు.
త్రిపుర గవర్నర్ రాయ్, రచయిత చేతన్ భగత్ హాట్ కామెంట్స్....
దీపావళి క్రాకర్స్ పై సుప్రీం ఆదేశాలతో ట్విట్టర్ లో హిందూ మతాన్ని కోర్టు లు శాసించేలా మారాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు పెద్దఎత్తున పలువురు ప్రముఖులు పోస్ట్ చేయడం గమనార్హం . అందులో త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్ తన ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనమే అయ్యాయి. వాయు కాలుష్యం జరుగుతుందని హిందూ శ్మశానాల్లో అంత్యక్రియలు లేకుండా భవిష్యత్తులో కోర్టు లు ఆదేశిస్తాయేమో అంటూ వ్యంగంగా స్పందించారు. ఆయన తన వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు లోబడే చేశానని మీడియా కు చెప్పడం విశేషం. ఇక ప్రముఖ రచయిత చేతన్ భగత్ మరింత ఘాటుగా స్పందించారు.న్యాయస్థానాలు ఇలాంటి నిర్ణయాలు ముస్లింల మొహరం రక్తపాతం నివారణకు, బక్రీద్ లో జంతువులను కాపాడేందుకు, క్రైస్తవ పండగలపైనా చేసే ధైర్యం ఉందా అంటూ ఆయన చెలరేగారు. ఇలా దీపావళి క్రేకర్స్ పై కోర్టు లు ఇచ్చిన నిషేధ ఉత్తర్వులు పండగ కన్నా ముందే పేలిపోతున్నాయి .