దీనిపై అందుకే దృష్టి పెట్టారా ..?

Update: 2017-11-29 04:30 GMT

భారత్ ఇప్పుడు అణ్వాయుధాలకు, అణు విద్యుత్తుకు కీలకమైన యురేనియం నిల్వలపై దృష్టి పెట్టింది. రాయలసీమలోని కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తుమ్మలపల్లిలో భారీ ప్లాంట్ ఒకటి 2007 లో యురేనియం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ లో అవుతున్న ఉత్పత్తి తమ లక్ష్యాలకు అనుగుణంగా లేనందున మరో ప్లాంట్ ఏర్పాటుకు యురేనియం కార్పొరేషన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశంలో అణువిద్యుత్తు అవసరాల కోసం ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తి అవుతున్న యురేనియం సరిపడక పోవడం వల్ల కొత్తప్లాంట్ కి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తుమ్మలపల్లి ప్లాంట్ లో యురేనియం ముడి సరుకు నెలకు 60 వేల టన్నులు ఉన్నప్పటికీ శుద్ధి చేయబడేది కేవలం 2000 తన్నులు మాత్రమే. నాలుగున్నర వేల టన్నుల శుద్ధి చేయబడిన యురేనియం కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకోవడంతో మరో ప్లాంట్ తప్పనిసరి అవుతుంది.

అందుకోసమేనా ....

ప్రపంచ వ్యాప్తంగా యురేనియం కి వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అణు విద్యుత్తు నుంచి అణ్వాయుధాల వరకు యురేనియం కీలకం. చైనా తో పాకిస్థాన్ తో భారత్ కి ముప్పు వున్న నేపథ్యంలో శుద్ధి చేయబడిన యురేనియం నిల్వలు భారీగా పెంచుకోవాలన్న వ్యూహంతోనే కార్పొరేషన్ చర్యలు చేపట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కడప జిల్లాలోనే కాకుండా రాయలసీమ లోని నంద్యాల తదితర ప్రాంతాలను నిపుణులు యురేనియం కోసం జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఏరియల్ సర్వే భూగర్భ పరీక్షలను సాగిస్తున్నారు అధికారులు. రక్షణ సంబంధిత అంశం కావడంతో అధికారికంగా ప్రభుత్వం ఇలాంటి కీలక అంశాలు బయటపెట్టకపోవొచ్చు కానీ దేశ స్వీయ రక్షణ కోసం యురేనియం కార్పొరేషన్ సైతం దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవించి శరవేగంగా పనులు సాగిస్తుంది. ఇన్ని పనులు సాగుతున్నా ఇవన్నీ గప్ చిప్ గా కొనసాగడం గమనార్హం.

Similar News