వరుసగా జరుగుతున్న పరిణామాలు దినకరన్ ను కొంత ఆలోచనలో పడేశాయి. తమిళనాడులో రాజకీయంగా పళనిస్వామి, పన్నీర్ సెల్వలు బలపడుతున్నారు. అన్నాడీఎంకే పార్టీ పేరు, గుర్తు కూడా రాలేదు. అయితే కోట్లు ఖర్చు చేసి ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ ఘన విజయం సాధించారు. సొంత పార్టీ పెట్లాలని కూడా ప్రయత్నించారు. అయితే శశికళ వారించడంతో కొంత వెనక్కు తగ్గారు. కొత్త పార్టీపై దినకరన్ వెంట ఉన్నవారే అభ్యంతరం వ్యక్తం చేశారు. దినకరన్ పార్టీ పెడితే తాము అందులోకి వెళ్లబోమని దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు బహిరంగంగానే ప్రకటించారు.
ఉప ఎన్నికలు వస్తే....
దీంతో దినకరన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టారు. దినకరన్ వెంట 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. అయితే అనర్హతపై దినకరన్ వర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ తీర్పు ప్రస్తుతం రిజర్వ్ లో ఉంది. తీర్పు అనుకూలంగా వస్తే ఓకే. ప్రతికూలంగా వస్తేనే దినకరన్ కు ఇబ్బంది తప్పదు. మళ్లీ 18 స్థానాల్లో తన వర్గం వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత దినకరన్ పైనే ఉంటుంది. అందుకోసమే దినకరన్ కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. తాను పెట్టిన షరతులకు అంగీకరిస్తే అన్నాడీఎంకేలో విలీనం చేయడానికి సిద్ధమని ఈరోజు ప్రకటించడం విశేషం.
షరతులు ఇవే....
అయితే దినకరన్ విధించిన షరతులు వింతగా ఉన్నాయి. అనర్హత వేటు వేసిన 18 మంది ఎమ్మెల్యేల్లో తాను సూచించిన వారిని ముఖ్యమంత్రిని చేయాలట. అలాగే పళనిస్వామి ప్రభుత్వంలో మంత్రిపదవులు అనుభవిస్తున్న ఆరుగురిని తొలగించాలట. ఆ పేర్లు దినకరన్ చెబుతారట. దీనికి ఒప్పుకుంటే అన్నాడీఎంకేలో తాను విలీనం కావడానికి అభ్యతరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు తనకు మాత్రం ముఖ్యమంత్రి పదవి వద్దన్నారు. తనకు దానిపై ఆశలేదని చెప్పారు. ఇలా షరతులు పెట్టి పళనిస్వామి సర్కార్ ముందు దినకరన్ విలీన ప్రతిపాదన ఉంచారు.
పళని అంగీకరిస్తారా?
అయితే దీనికి పళనిస్వామి ఎందుకు అంగీకరిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంకా సుమారు మూడేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉండే అవకాశాన్ని ఎవరు చేజార్చుకుంటారు? దినకరన్ ఈ విలీన ప్రతిపాదన పెట్టడం వెనక ఆంతర్యమేంటి? ఉప ఎన్నికలు వస్తే ఇబ్బంది తప్పదని దినకరన్ గ్రహించారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే ఎదుట డీలా పడిపోతామని గ్రహించి ముందుగానే ఈ విలీన ప్రతిపాదన తెచ్చారా? అన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది. అయితే దీనిపై పళనిస్వామి ఇంకా స్పందించలేదు.