ఆర్కే నగర్ ఉప ఎన్నికల ఖర్చు చూసి ఎన్నికల కమిషన్ నోరెళ్లపెట్టింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఒకసారి వాయిదా పడి తిరిగి నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ దాదాపు నలభై వేలు పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఆర్కే నగర్ లో గెలుపు వ్యక్తలది కాదని, డబ్బులదని అన్ని రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నిక పూర్తవ్వడం, అభ్యర్థులు ఎన్నికల కమిషన్ కు లెక్కలు సమర్పించాల్సి ఉంది. ఇలా సమర్పించిన వారిలో టీటీవీ దినకరన్ చూపించిన లెక్కలకు, వాస్తవానికి పొంతన లేదని తెలుస్తోంది. అందుకే దినకరన్ చూపించిన లెక్కలకు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలపనట్లు సమాచారం.
అత్యంత ఖరీదైన ఎన్నికగా...
ఆర్కే నగర్ ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా పేర్కొన్నారు. గత డిసెంబరు 21వ తేదీన ఈ ఎన్నిక జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో 120 కోట్లు ఖర్చు పెట్టాయని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. అనధికారికంగా ఈ ఖర్చు 350 కోట్ల పైమాటేనంటున్నారు. దినకరన్ వర్గం ఇరవై నోటు రూపాయలను టోకెన్లుగా ఇచ్చి ఓటుకు ఐదు నుంచి పదివేల రూపాయల వరూ పంచిపెట్టినట్లు ప్రత్యర్థి పార్టీలు ఆరోపించాయి. ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశాయి. ఈ సందర్భంగా దినకరన్ వర్గీయులతో స్థానికులు గొడవకు దిగిన సంగతి తెలిసిందే. దినకరన్ వర్గీయులను అరెస్ట్ చేసి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
దినకరన్ ఖర్చు ఇంతేనట...
అయితే తాజగా దినకరన్ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన లెక్కలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు దినకరన్ ఖర్చు పెట్టింది కేవలం నాలుగు లక్షల 31 వేల రూపాయలు మాత్రమేనట. అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్ 4.62 లక్షలు, డీఎంకే అభ్యర్థి మరదు గణేష్ 1.43 లక్షలు ఖర్చుచేసినట్లు ఎన్నికల కమిషన్ కు లెక్కలు సమర్పించారు. అయితే అనుమానం వచ్చిన ఎన్నికల కమిషన్ అధికారులు ఈ లెక్కలపై లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా టీటీవీ దినకరన్ చూపించిన లెక్కల్లో తేడాలున్నట్లు స్పష్టమయిందంటున్నారు. దీంతో దినకరన్ కు కష్టాలు తప్పవంటున్నారు. నిజంగా దినకరన్ లెక్కల్లో తేడాలుంటే ఎన్నికల కమిషన్ దినకరన్ పై అనర్హత వేటు వేసే అవకాశముంది. తమ తనిఖీల్లో, నిఘా ద్వారా బయటపెట్టిన సమాచారాన్నికూడా జోడించి త్వరలో దినకరన్ లెక్క ఎన్నికల కమిషన్ తేల్చనుంది.