టీటీవీ దినకరన్ తమిళనాడులో రాష్ట్ర పర్యటనను ప్రారంభించారు. తమ వర్గాన్ని పటిష్టం చేసుకునే దిశగానే ఈ పర్యటన దినకరన్ చేపట్టారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దినకరన్ పర్యటనకు తమిళనాడులో మంచి స్పందనే లభిస్తుంది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఇటీవల తన వర్గానికి చెందిన వెయ్యి మందిని పార్టీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తొలగింపుతో శశికళ క్యాడర్ లో అయోమయం నెలకొంది. దినకరన్ తో టచ్ లోకి రావడానికి కూడా కొందరు నేతలు భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు.
రాష్ట్ర వ్యాప్త పర్యటనలో....
ఈ నేపథ్యంలో క్యాడర్ లో భయాందోళనలను తొలగించేందుకే తాను రాష్ట్ర పర్యటన చేపట్టినట్లు దినకరన్ స్పష్టంగా చెబుతున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం తర్వాత ఆత్మవిశ్వాసంతో ఉన్న దినకరన్ మూడు నెలల్లో పళని ప్రభుత్వాన్ని కూల్చి వేస్తారని చెప్పారు. అయితే ఎమ్మెల్యేల అనర్హత వేటు వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. అది తేలితే కాని దినకరన్ తన వ్యూహాన్ని అమలుపర్చరని ఆయన వర్గీయులే చెబుతున్నారు. దినకరన్ అన్నాడీఎంకు తానే నాయకుడిని కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. మేనత్త శశికళ బిక్షతో ముఖ్యమంత్రిగా ఎన్నికైన పళనిస్వామిని ఎలాగైనా గద్దెదించాలని ఆయన తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జైలుకు వెళ్లి శశికళను కలిసి ఆమె అనుమతి తీసుకుని దినకరన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనను ప్రారంభించారు.
సెంటిమెంట్ తో కొట్టే యత్నం....
కిందిస్థాయి క్యాడర్ నుంచి వత్తిడి తెచ్చేందుకే ఈ రాష్ట్ర పర్యటన పెట్టుకున్నారు. మక్కల్ సందిప్పు పురచ్చి పయనం పేరుతో ఈయాత్రను దినకరన్ చేపట్టారు. రాష్ట్రంలో తిరిగి జయలలిత రాజ్యాన్ని తెచ్చేది తానేనని జనంలోకి వెళుతున్నారు. ఒకవైపు పళనిస్వామి సర్కార్ పై విమర్శలు చేస్తూనే తన వర్గాన్ని పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు దినకరన్. కావేరీ డెల్టా రైతులకు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. అలాగే జయలలిత ప్రవేశపెట్టిన అనేక పథకాలను పళని సర్కార్ నీరుగార్చిందని చెప్పారు. తానే జయలలితకు అసలైన వారసుడని ప్రతి సభలో దినకరన్ చెప్పుకుంటూ పోవడం విశేషం. తమిళనాడు శాసనసభకు ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని కూడా చెబుతున్నారు. పళని కమలం పార్టీ చేతిలో బందీ అయ్యారని, తమిళుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని కూడా దినకరన్ విమర్శిస్తున్నారు. ఇలా పళని, పన్నీర్ లపై దినకరన్ మైండ్ గేమ్ ప్రారంభించారు.