తమిళనాడులో లెక్కలు తేలడం లేదు. ఆర్కే నగర్ లో ఊహించని మెజారిటీతో విజయం సాధించిన దినకరన్ పళని స్వామి వర్గం ఎమ్మెల్యేలపై కన్నేశారు. ఎలాగైనా తన వర్గంలోకి చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 19 మంది ఎమ్మెల్యేలు దినకరన్ తో టచ్ లోకి వచ్చారు. వీరిలో కొందరు దినకరన్ ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. ఈనేపథ్యంలో జనవరి నెలలో తమిళనాడు శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే పళనిస్వామి ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాలని మరోమారు డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు.
బలపరీక్షే జరిగితే...
గతంలో బలపరీక్షలో పళనిస్వామి నెగ్గినప్పుడు పెద్దగా వ్యతిరేకత లేదు. కాని ఇప్పుడు మాత్రం పన్నీర్ సెల్వం కలిసినప్పటికీ ఆయనలో ఆందోళన బయలుదేరిందంటున్నారు. శాసనసభలో బలపరీక్ష లో నెగ్గాలంటే 118 మంది ఎమ్మెల్యేలు అవసర మవుతారు. అయితే ప్రస్తుతం పళనిస్వామి వర్గంలో మొత్తం 117 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అందులో స్పీకర్ కూడా ఒకరు కావడంతో ఓటింగ్ లో పాల్గొనేది 116 మంది మాత్రమే. దీంతో పళనిస్వామి బలపరీక్షలో నెగ్గడం కష్టమేనన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. తమిళనాడు గవర్నర్ గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన బన్వరిలాల్ పురోహిత్ బలపరీక్షకు సిద్ధం కావాలని ఆదేశిస్తే మాత్రం పళనిసర్కార్ చిక్కుల్లో పడ్డట్లే.
ప్రమాదం అంచున పళని సర్కార్...
తమిళనాడు శాసనసభలో డీఎంకేకు 89 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ కు 8 మంది, ముస్లింలీగ్ కు ఒకరు మొత్తం 98 మంది సభ్యులున్నారు. ఇందులో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా ఉన్నారు. అయితే కరుణానిధి ఓటు వేసే అవకాశం లేదు. దీంతో డీఎంకే బలం మిత్రపక్షాలతో కలిపి 97 మాత్రమే. వీరికి దినకరన్ జత కలిస్తే ఆయనకు 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది. అంటే 117 మంది సభ్యుల బలం విపక్షాలకూ ఉందన్నది వాస్తవం. అంటే స్పీకర్ ను తీసేస్తే పళనిస్వామికి 116 మంది మాత్రమే అండగా ఉండగా, విపక్షంతో దినకరన్ చేతులు కలిపితే 117 మంది సభ్యుల బలం ఉంది. దీంతో పళని సర్కార్ ను కూల్చివేయవచ్చన్న ఆలోచన దినకరన్ చేస్తున్నారు. అయితే బలపరీక్ష విషయంలో హైకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇప్పటికే గవర్నర్ ను దినకరన్, స్టాలిన్ వర్గాలు కలిసి బలపరీక్షకు ఆదేశించాలని కోరారు. దీనిపై గవర్నర్ ఇంకా స్పందించలేదు. మొత్తం మీద జనవరి నెలలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో రచ్చరచ్చ అవుతుందని అంటున్నారు.