ఆర్కే నగర్ లో టీటీవీ దినకరన్ అఖండ మెజారిటీతో గెలిచారు. ఇదెలా సాధ్యమయిందని అందరూ ముక్కున వేలేసుకున్నారు. కాని దినకరన్ బ్యాచ్ పకడ్బందీగా డబ్బులు పంచిపెట్టిందని తేలింది. అంతేకాదు ఈసీ కన్నుకప్పి మరీ డబ్బులను పంచడంలో విన్నూత్న విధానానికి తెరతీసింది మన్నార్ గుడి మాఫియా. ఆర్కే నగర్ లో ఓటర్లందరికీ ఇరవై రూపాయల టోకెన్లను పంచారు. ఈ ఇరవై రూపాయల నోట్లన్నీ ఒకే వరుస నెంబర్లున్నాయి. వీటి మీద టోకెన్ నెంబర్లను రాశారు.
టోకెన్లు ఇచ్చి....
అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ టోకెన్లు ఇస్తే ఇరవై రూపాయలకు పదివేలు ఇస్తామని దినకరన్ బ్యాచ్ ఓటర్లకు చెప్పింది. పక్క నియోజకవర్గంలో పది వేలు ఇస్తామని నమ్మబలికింది. దీంతో ఓటర్లు నమ్మారు. ఇరవై రూపాయల నోటును భద్రంగా దాచుకున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత దినకరన్ గ్యాంగ్ పత్తా లేకుండా పోయింది. ఇక ఫలితాలు వచ్చిన తర్వాతైనా ఇస్తారేమో అని ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురయింది.
నలుగురి అరెస్ట్....
దీంతో తమకు టోకెన్లు పంచిన వారిని కొందరుఓటర్లు నిలదీశారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఇస్తామని ఎందుకు ఇవ్వలేదని పట్టుకున్నారు. అయితే ఈ టోకెన్లు పంచిన వారంతా ఆర్కే నగర్ కు చెందిన వారే కావడం విశేషం. ఇప్పుడు ఓటర్లు వీరిని పట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో నలుగురు చిక్కడంతో వారిని పోలీసులకు అప్పగించారు. మొత్తం మీద ఇరవై నోటు ఇచ్చి దినకరన్ గ్యాంగ్ ఓటర్లను పెద్దయెత్తున మోసం చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందువల్లనే దినకరన్ గెలుపు సాధ్యమయిందని అంటున్నారు. ఈ సందర్భంగా దినకరన్ అనుచరులకు, ఓటర్లకు మధ్య ఘర్షణ జరగడం విశేషం.