దినకరన్ దిగాలు పడ్డారే....!

Update: 2018-02-20 17:30 GMT

కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన టీటీవీ దినకరన్ ఎందుకు వెనక్కు తగ్గారు? శశికళ విధించిన షరతులేంటి? ఏ వత్తిళ్ల కారణంగా టీటీవీ దినకరన్ పార్టీ ప్రకటనను వాయిదా వేసుకున్నారు. ఇదే తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలో జరుగుతున్న చర్చ. టీటీవీ దినకరన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో భారీ ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ మెజారిటీ దినకరన్ కూడా ఊహించలేదు. ఈ విజయంతో మూడు నెలల్లో ప్రభుత్వాన్ని పడగొడతానని సవాల్ విసిరారు. అంతేకాదు తాను సొంత పార్టీ పెట్టబోతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే దినకరన్ వెంట ఉన్న అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలే సొంత పార్టీ పెట్టడంపై పెదవి విరిచారు.

కొత్త పార్టీ పెట్టాలని....

తన అనుచరులు కొత్త పార్టీ ప్రకటన విముఖత వ్యక్తం చేసినా దినకరన్ మాత్రం పార్టీ పెట్టాల్సిందేనని ఒకదశలో ఊగారు. అయితే మన్నార్ గుడి మాఫియా ఎంటర్ కావడంతో ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా దినకరన్ పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. కొత్త పార్టీ పెడితే శశికళ బంధువలందరికీ అందులో చోటివ్వాలని, ముఖ్యమైన పదవులు ఇవ్వాలని చిన్నమ్మ చేతే చెప్పించారట. ఇటీవల దినకరన్ శశికళను పరప్పణ అగ్రహార జైలులో కలిశారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ ప్రతిపాదనను ఆమె ముందుంచారు. శశికళ మాత్రం పార్టీ పెట్టినా అందులో కీలక పదవుల్లో మనోళ్లే ఉండాలని చెప్పారు.

బంధువులు చుట్టుముట్టడంతో....

కొత్త పార్టీలో యువజన విభాగం అధ్యక్షులుగా జయంత్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా కృష్ణప్రియ, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా వివేక్ ను నియమించాలన్నది శశికళ ఆదేశం. అయితే వీరు ముగ్గురూ శశికళ రక్తసంబంధీకులే. మిగిలిన కీలక పోస్టుల్లోనూ బంధుగణాన్నే నియమించాలని, ఎవరినీనమ్మలేని పరిస్థితి ఉందన్నది శశికళ వాదన. అయితే అక్కడ తలాడించి వచ్చిన దినకరన్ తర్వాత తన ఆలోచనలు మార్చుకున్నట్లు తెలిసింది. కొత్త పార్టీలో కూడా బంధుగణానికే పెద్దపీట వేస్తే కుటుంబ పార్టీగా ముద్రపడే అవకాశముందని ఆయన ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతానికి లేనట్లే....

శశికళను పార్టీకి అధ్యక్షురాలిగా నియమించాలన్నది కూడా ఒక డిమాండ్. అయితే దినకరన్ ఈ ప్రతిపాదనలకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. మన్నార్ గుడి మాఫియా ముద్ర కొత్త పార్టీపైన పడితే ఇతర సామాజిక వర్గాలు దూరమవుతాయని కుటుంబ సభ్యులకు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఆయన కొత్త పార్టీ ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు తన వెంట ఉన్న అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు కూడా కొత్త పార్టీ వద్దని, అధికార అన్నాడీఎంకే పేరును, గుర్తును కైవసం చేసుకునేందుకే ప్రయత్నించాలని చెబుతుండటంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇప్పట్లో దినకరన్ కొత్త పార్టీ ప్రకటన వచ్చే అవకాశం లేదన్నది టీటీవీ సన్నిహితుల సమాచారం.

Similar News