దినకరన్ డీలా... స్టాలిన్ స్టామినా...!

Update: 2017-12-08 20:30 GMT

మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ మేనల్లుడు దినకరన్ కు అనుకున్నది దక్కలేదు. ఆయన టోపీ గుర్తు కోరుకోగా చివరకు ప్రెషర్ కుక్కర్ గుర్తు దక్కింది. దినకరన్ టోపీ గుర్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎన్నికల సంఘం దినకరన్ కు ప్రెషర్ గుర్తు ఇవ్వడంతో ఆయన డీలా పడ్డారు. తనకు టోపీ గుర్తునే కేటాయించాలంటూ ఆయన ఎన్నికల కమిషన్ అభ్యర్థించారు. ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు అయితే ఫలితం లేకుండా పోయింది. దినకరన్ గత ఏప్రిల్ లో ఆర్కే నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయినప్పుడు టోపీ గుర్తు దక్కింది. ఆ గుర్తుతోనే ప్రజల్లో బాగా ప్రచారం చేశారు. డబ్బులు కూడా పెద్దమొత్తంలో టోపీ గుర్తుకు వేయాలని పంచినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే టోపీ గుర్తు కోసం పట్టుబట్టినా అది దక్కకపోవడంతో ఆయన డీలా పడ్డారు.

విశాల్ మద్దతు కోసం.....

మరోవైపు సినీహీరో విశాల్ పై దినకరన్ నమ్మకం పెట్టుకున్నారు. ఆర్కే నగర్ లో విశాల్ నామినేషన్ చెల్లకుండా పోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థికి మద్దతిస్తానని ప్రకటించారు. దీంతో దినకరన్ విశాల్ తనకు మద్దతిస్తారని నమ్ముతున్నారు. అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డీఎంకే పుంజుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్కే నగర్ ఎన్నికల్లో తమ పార్టీకి సానుకూలంగా ఉండటంతో మళ్లీ ఎన్నికను రద్దు చేయించాలని ప్రభుత్వం భావిస్తుందని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆరోపించారు. అంతేకాదు తాము విశాల్ కు అండగా ఉంటామని స్టాలిన్ ప్రకటించడం విశేషం. ఆర్కే నగర్ లో తెలుగు వారి ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఇటు దినకరన్, అటు డీఎంకే విశాల్ మద్దతును పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. విశాల్ నామినేషన్ విషయంలో ఒకే రోజు మూడు నిర్ణయాలు ప్రకటించడమేంటని ప్రశ్నించారు స్టాలిన్. విశాల్ కు న్యాయం జరగకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థపైనేనమ్మకం పోతుందన్నారు. ఇప్పుడు విశాల్ పైనే అందరి దృష్టి నెలకొంది.

.

Similar News