దినకరన్ డిసైడ్ చేసేశారు

Update: 2018-03-11 17:30 GMT

అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు తెలిపారు. అందుకు తేదీని కూడా నిర్ణయించేశారు. టీటీవీ దినకరన్ ఇటీవల ఆర్కే నగర్ కు జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధికార, ప్రతిపక్ష పార్టీని కాదని ఆర్కే నగర్ ప్రజలు దినకరన్ కు అండగా నిలిచారు. భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో దినకరన్ పళని ప్రభుత్వాన్ని మూడు నెలలో కూడగొడతానని ప్రకటించారు.

కొత్త పార్టీ పెడతానని....

ఈ నేపథ్యంలో ఆయన కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే సొంత గూటికి చెందిన ఎమ్మెల్యేలే దినకరన్ ప్రతిపాదనపై కస్సుమన్నారు. దినకరన్ కొత్త పార్టీ ఆలోచనలను మానుకుని, అన్నాడీఎంకేను తమ పరం చేసుకునేందుకు ఆలోచనలు చేయాలని వారు అన్నారు. దీంతో దినకరన్ కొంత వెనక్కు తగ్గినట్లే కన్పించింది. పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళనున కలిసిన దినకరన్ కొత్త పార్టీ ప్రతిపాదనను ఉంచారు. అయితే ఆమె తిరస్కరించారని అప్పట్లో వార్తలొచ్చాయి.

ఈనెల 15న పార్టీ ప్రకటన....

కొత్త పార్టీ పెడితే తమకు ముఖ్యమైన పదవులు ఇవ్వాలని శశికళ కుటుంబసభ్యులు దినకరన్ పై వత్తిడి తెచ్చారు. ముఖ్యంగా దివాకరన్ తనకు పార్టీలో ముఖ్యమైన పదవి కావాలని గట్టిగా కోరుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన కొంత వెనుకంజ వేసినట్లు కన్పించింది. అయితే ఎట్టకేలకు దినకరన్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 15వ తేదీన కొత్త పార్టీని పెడుతున్నానని, ఆరోజు పార్టీ పేరు, గుర్తును కూడా వెల్లడించనున్నట్లు దినకరన్ చెప్పారు.

మధురైలో బహిరంగ సభ.....

దినకరన్ కూడా కమల్ లాగే మధురైలోనే బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ నెల 15న పార్టీ గుర్తును, పేరును ప్రకటించబోతున్నారు. ఆ సభలోనే పార్టీ సిద్ధాంతాలను, విధివిధాలను కూడా దినకరన్ తెలియజేయనున్నారు. అయితే దినకరన్ కొత్త పార్టీలో ఎవరు చేరబోతున్నారన్న ఆసక్తి సర్వాత్రా నెలకొని ఉంది. ఇప్పటికే పళనిస్వామి సర్కార్ లో ఎమ్మెల్యేలు కొందరు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. వీరు ఇప్పటికే రజనీకాంత్, కమల్ పార్టీలవైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరి దినకరన్ వెంట ఎవరుంటారనేది త్వరలోనే తెలియనుంది.

Similar News