ఒక్కడే...ఆ ఇద్దరిని ముప్పుతిప్పలు పెడతున్నాడు. నిద్రపోనివ్వకుండా చేస్తున్నాడు. ఎప్పుడు ఎమ్మెల్యేలు జారీపోతారోనని అధికార పార్టీలో గుబులు పట్టుకుంది. ఆయనే టీటీవీ దినకరన్. దినకరన్ గతంలో రాజ్యసభకు, లోక్ సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవముంది. జయ ఎత్తుగడలు... చిన్నమ్మ చిట్కాలు పాలిటిక్స్ లో ఉపయోగించడంలో దిట్ట అయిన దినకరన్ అంటే అధికార అన్నాడీఎంకే పార్టీలో అందరికీ అదుర్స్. ఎందుకంటే ఆయన చాపకింద నీరులా తన పనితాను చేసుకుపోతారు. ఆయనంటే నేతలకు కూడా ఒక నమ్మకం. ఆ నమ్మకమే పెట్టుబడిగా మరింత మంది ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకునేందుకు దినకరన్ పావులు కదుపుతున్నారు.
చిన్నమ్మ నుంచి సంకేతాలు...
ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ చేతిలో చావుదెబ్బ తిన్న అన్నాడీఎంకే నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయంటేనే బెదిరిపోయే పరిస్థితి ఏర్పడింది. 19 మంది ఎమ్మెల్యేలను అతి తేలిగ్గా తన వైపునకు తిప్పుకోగలిగిన దినకరన్ పగ తీర్చుకోవడానికి ఏమైనా చేయగలరు. పళనిస్వామిపై చిన్నమ్మ కుటుంబం పగతో రగలిపోతోంది. తాను నమ్మకంగా క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని చేస్తే బీజేపీతో చేతులు కలిపి తనకే మోసం చేస్తారని మన్నార్ గుడి మాఫియా మంటెక్కిపోతోంది. ఈ నేపథ్యంలో పళనిస్వామిని ఎలాగైనా కుర్చీనుంచి దించేయాలని దినకరన్ కు చిన్నమ్మ నుంచి సంకేతాలు అందడంతో ఆయన ఆపరేషన్ షురూ చేసినట్లు చెబుతున్నారు.
ఎమ్మెల్యేల కోసం....
దినకరన్ మీద చిన్నమ్మకు అపారమైన నమ్మకం. అందుకే తాను జైలుకు వెళుతూ పార్టీ డిప్యూటీ సెక్రటరీగా నియమించి వెళ్లింది. అలాగే ఆర్కే నగర్ నియోజకవర్గంలో దినకరన్ మాత్రమే బరిలోకి దింపింది. దినకరన్ మీద ఉన్న నమ్మకానికి ఇది ఉదాహరణ. హేమాహేమీల మధ్య బరిలోకి దిగి తన మేనత్తకు కానుకగా ఆర్కేనగర్ ను అందించాడు దినకరన్. ఈ నెల8వ తేదీ నుంచి తమిళనాడు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైతే డీఎంకేతోనైనా చేతులు కలిపేందుకు దినకరన్ సిద్ధమయినట్లు వార్తలువస్తున్నాయి. మరోవైపు శాసనసభలో బలనిరూపణకు పళనిస్వామిపై డీఎంకేతో కలిసి దినకరన్ వత్తిడి తేనున్నట్లు తెలిసింది. దినకరన్ కు ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కొందరు మద్దతు తెలిపారు. అసెంబ్లీలో తానేంటో చూపిస్తానని దినకరన్ తన సన్నిహితుల వద్ద చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం కల్గిస్తున్నాయి. అందుకోసమే పళని, పన్నీర్ లు ఎమ్మెల్యేలు జారిపోకుండా, వారికి తాయిలాలు పంచుతూ ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. కాని దినకరన్ మాత్రం మామూలోడు కాదు. ఏదైనా చేయగలదు. ఈ విషయం అనేకసార్లు ప్రూవ్ అవ్వడంతో అధికార పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.