దినకరన్ టార్గెట్...ఆ... ఐదుగురేనా?

Update: 2018-01-08 18:29 GMT

తొలిరోజు తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రశాంతంగా ముగిసినా రేపటి నుంచి వార్ ప్రారంభమవుతుందని అంచనా. ముఖ్యంగా అధికార అన్నాడీఎంకే పై ఇటు ప్రతిపక్ష డీఎంకే, స్వతంత్ర సభ్యుడు దినకరన్ రేపటి నుంచి విరుచుకుపడనున్నారు. రేపటి నుంచి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో దినకరన్ ఐదుగురు మంత్రులపై విరుచుకుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకేలో ఉన్న మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారన్నది దినకరన్ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు వేలుమణి, తంగమణి, ఉదయ్ కుమార్, జయకుమార్, వీరమణిలపైనే ఎక్కువగా గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మంత్రులకు సంబంధించిన శాఖలపై సమగ్ర సమాచారాన్ని దినకరన్ ను తెప్పించుకున్నారు. వీరిపై ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది ఆయన వ్యూహంగా కన్పిస్తోంది.

స్పష్టమైన ఆరోపణలతో....

ముఖ్యంగా జయలలిత కాలంలో ఆమె చేసిన అనేక పథకాలను నేటికీ ప్రారంభించకపోవడంపై దినకరన్ నిలదీయనున్నారు. అలాగే జయ ప్రారంభించిన వివిధ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకున్న వైనాన్ని కూడా దినకరన్ ఎండగట్టనున్నారు. ఉదాహరణకు తండయారు పేటలో కలరాఆసుపత్రి ఉంది. ఇది 14 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆసుపత్రిని వైద్య కళాశాలగా చేయాలని జయలలిత బతికి ఉన్న సమయంలో నిర్ణయించారు. అయితే ఆమె మృతి చెందిన తర్వాత పళనిస్వామి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలా జయ లలిత లక్ష్యాలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్న ఆరోపణలతో దినకరన్ దూసుకెళ్లనున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అవసరమైతే విపక్ష డీఎంకేతో చేతులు కలపడానికి కూడా దినకరన్ సిద్ధమయ్యారు.

దినకరన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు....

ఇక డీఎంకే కూడా అధికార పార్టీపై విరుచుకుపడేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పాటు ఆర్థిక లోటు, రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు డీఎంకే సిద్ధమయింది. అయితే దినకరన్ ను ఎదుర్కొనేందుకు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఎమ్మెల్యేల సమావేశంలో దినకరన్ దూకుడుకు కళ్లెం వేయడానికి అవసరమైన సూచనలు చేశారు. అంతేకాకుండా దినకరన్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా రెడీ అవ్వాలని మంత్రులందరికీ వీరు సూచించారు. దినకరన్ సమాధానాలకు మంత్రి చెప్పకుంటే అవసరమైతే ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని రంగంలోకి దించాలని ముఖ్యమంత్రి పళనిస్వామి యోచిస్తున్నారు. మొత్తం మీద రేపటి నుంచి తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి.

Similar News