దినకరన్ ఎందుకు వెనక్కు తగ్గారంటే...!

Update: 2018-01-19 16:30 GMT

తమిళనాడులో టీటీవీ దినకరన్ కొత్త పార్టీ పెడతానని చెప్పడం కేవలం బెదిరింపులకేనా? ఆయనకు పార్టీ పెట్టే సత్తా ఉన్నా ఆయన వెనక ఎవరూ రారా? అందుకే ఎంజీఆర్ జయంతి సందర్భంగా కొత్త పార్టీని ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఈ మేరకు పుదుచ్చేరిలో తన అనుచరులు, సన్నిహితులతో సమావేశమయ్యారు. అయితే ఆ తర్వాత పార్టీని ప్రకటించలేదు. జయ పేరుతో కొత్త పార్టీ వస్తుందన్న ప్రచారమూ జరిగింది. కాని ఇంతలోనే దినకరన్ వెనక్కు తగ్గారు. పళనిస్వామి ప్రభుత్వానికి రెండు నెలల సమయం ఇస్తున్నానని, రెండునెలల్లోగా పార్టీలో, ప్రభుత్వంలో జయ ఆశయాలను అమలు చేయకుంటే అప్పుడు కొత్త పార్టీని ప్రకటిస్తానని దినకరన్ మాట మార్చారు.

ఎవరూ రాకపోవడంతో....

అయితే దినకరన్ కొత్త పార్టీ పెడితే ఆయన వెనక నడిచేందుకు ఎవరూ సాహించకపోవడమే వెనక్కు తగ్గడానికి కారణమని తెలుస్తోంది. దినకరన్ వెంట 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిపై తమిళనాడు స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీనిపై ఇప్పుడు వీరంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడంతో దినకరన్ కొత్త పార్టీ ఆలోచన మొదలుపెట్టారు. అయితే అనర్హత వేటు పడిన 18 మంది ఎమ్మెల్యేలు దీన్ని వ్యతిరేకించారు. కొత్త పార్టీ పెట్టడం వల్ల లాభమేదీ ఉండబోదని, అన్నాడీఎంకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాలే తప్ప, కొత్త పార్టీ ఆలోచన మానుకోవాలని వారు సూచించారు.

రెండాకులను స్వాధీనం చేసుకోవాలని....

అంతేకాకుండా అన్నాడీఎంకే కాకుండా కొత్త పార్టీ పెడితే తాము రాబోమని కూడా తెగేసి చెప్పారు. ముఖ్యంగా అనర్హత వేటు పడిన ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ బహిరంగంగానే దినకరన్ కొత్త పార్టీని వ్యతిరేకించారు. దినకరన్ కొత్త పార్టీ పెడితే తాము వెళ్లబోమని స్పష్టం చేశారు. 18 మంది ఎమ్మెల్యేలు కూడా దినకరన్ వెంట వెళ్లబోరని చెప్పారు. రెండాకుల గుర్తును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప కొత్త పార్టీ ఆలోచనను దినకరన్ మానుకోవాలని కూడా తంగ తమిళ్ సెల్వన్ సూచించారు. ఒక తమిళ్ సెల్వన్ మాత్రమే కాదు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరిదీ దాదాపు ఇదే మాట. దీంతో దినకరన్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు సయితం తన వెంట నడవరేమోనన్న భయం దినకరన్ కు పట్టుకుంది.

శశికళ చివాట్లు....

మరోవైపు కొత్త పార్టీని ప్రకటిస్తానన్న దినకరన్ వ్యాఖ్యలపై పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళ కూడా మండిపడ్డారు. శశికళను కలిసిన అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఆమె భరోసా ఇస్తూ దినకరన్ కు వారి ద్వారా సందేశం పంపినట్లు సమాచారం. దీంతోనే దినకరన్ వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు తమిళనాడులో కొత్త పార్టీ దినకరన్ పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదన్నది అందరికీ తెలిసిందే. తన వెంట ఉన్న అనచరులను, క్యాడర్ ను కాపాడుకునేందుకే దినకరన్ కొత్త పార్టీ ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. అయితే అనుకున్నది ఒకటయితే... జరిగింది మరొకటి లాగా తన వెంట ఉన్నవారందరూ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించడంతో దినకరన్ పళనిస్వామికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారన్న టాక్ తమిళనాట బలంగా విన్పిస్తోంది.

Similar News