దాహం తీర్చుకున్న కొహ్లి : తొలిరోజే సెంచరీ!

Update: 2016-10-08 11:23 GMT

రెండు టెస్టుల్లో విఫలమైన కెప్టెన్‌ విరాట్‌ కొహ్లి ఒక్కసారిగా జూలు విదిల్చి న్యూజీలాండ్‌ జట్టుపై విరుచుకుపడ్డాడు. 184 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి.. తాను మళ్లీ ఫాంలోకి వచ్చాను.. జట్టుకు ఢోకా లేదని సంకేతాలు ఇచ్చాడు. ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో కూడా ఘన విజయం ద్వారా.. క్లీన్‌ స్వీప్‌ చేయడంపై భారత్‌ కన్నేసినటన్లు కొహ్లి దూకుడు విపులంగా తెలియజెబుతోంది.

టాస్‌ గెలిచిన కొహ్లి బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. కానీ 60పరుగులకే భారత్‌ ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోవాల్సి రావడంతో క్రీజ్‌లోకి అడుగుపెట్టిన కొహ్లి... ఇదివరకటి రెండు మ్యాచ్‌లలో మాదిరిగా కాకుండా పూర్తి ఫాంలో ఉన్నట్లుగా కనిపించాడు. తనదైన శైలిలో కచ్చితమైన షాట్లు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. జట్టు 100 పరుగుల వద్ద ఉండగా పుజారా కూడా అవుటైన తర్వాత.. ఆజింక్య రహానే క్రీజ్‌ లోకి రావడం.. కొహ్లికి మరికాస్త జోష్‌ను జత చేసింది. ఇద్దరూ కలిసి ఒక రేంజిలో న్యూజీలాండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రహానే కూడా 161 బంతుల్లో 74 పరుగులతో సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.

ఈ టెస్టు గెలిస్తే.. భారత్‌ న్యూజీలాండ్‌తో 3-0 గా జరుగుతున్న సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసినట్లు అవుతుంది. మరి ఆ అరుదైన రికార్డును కొహ్లి ఎలా వ్యూహాత్మకంగా సాధిస్తాడో చూడాలి.

3వ టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లకు భారత్ 267 పరుగులు చేసింది. విరాట్ కొహ్లి 103, రహానే 79 పరుగుల వద్ద క్రీజులో ఉన్నారు.

Similar News