దానికీ...దీనికీ లింకుందా?

Update: 2017-12-22 16:30 GMT

సొంత లాభం కొంత మేర‌కైనా మానుకుని పొరుగువాడికి సాయ‌ప‌డ‌వోయ్‌! అన్నారు గుర‌జాడ అప్పారావుగారు. నిజానికి ఆ కాలంలో కాబ‌ట్టి ఆయ‌న అలా చెప్పి బ‌తికి పోయారు! అదే ఈ కాలంలో అయితేనా?! సొంత లాభం ఎంత మేర‌కు సాధ్య‌మైతే అంతవ‌ర‌కు పిండుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పొరుగువాడికి సాయ‌ప‌డ‌డం అల‌వాటైపోయింది. ముఖ్యంగా రాజ‌కీయాల్లో సొంత‌లాభం లేనిదే.. అటు కాలు ఇటు తీసిపెట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. విష‌యంలోకి వెళ్తే.. గుజ‌రాత్‌లో అప్పుడెప్పుడో చోటు చేసుకున్న భుజ్ భూకంపం దేశం మొత్తాన్ని కుదిపేసిన‌ట్టు.. యూపీఏ ప్ర‌భుత్వంలో వెలుగులోకి వ‌చ్చిన 2-జీ స్పెక్ట్ర‌మ్ కుంభ‌కోణం కూడా దేశాన్ని కుదిపేసింది.

అధికారాన్ని దూరం చేసింది....

2014లో ఈ కుంభకోణ‌మే కాంగ్రెస్‌కు అశ‌నిపాతంగా మారి అధికారం కోల్పోయేలా చేసింది. కేంద్ర మంత్రి రాజా, అప్ప‌టి ఎంపీ క‌నిమొళిలు జైలు జీవితం కూడా అనుభ‌వించారు. తీవ్రంగా దేశాన్ని కుదిపేసి న ఈ కుంభ‌కోణంలో తాజాగా సీబీఐ కోర్టు తీర్పు వెలువ‌రించింది. ఇది కూడా ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుండ‌డం గ‌మ‌నార్హం. కార‌ణం.. ఈ కేసు లో అంద‌రూ నిర్దోషులేన‌ని కోర్టు తీర్పు చెప్ప‌డ‌మే. ఇక‌, ఈ కేసుపై తీర్పు విడుద‌ల‌య్యాక‌ కాంగ్రెస్‌, డీఎంకేలు సంబ‌రాలు చేసుకున్నాయి. ఎవ‌రికివారు త‌మ నిర్దోషిత్వం నిరూప‌ణ అయిందంటూ చాటుకుంటున్నారు. 2జీ స్పెక్ట్ర‌మ్ కేటాయింపుల్లో ఏదో అవినీతి జ‌రిగిపోయిందంటూ మ‌మ్మ‌ల్ని ఆడిపోసుకున్నార‌నీ, ఆఖ‌రిని మౌన‌ముని లాంటి మ‌న్మోహ‌న్ సింగ్ ను కూడా ఇందులోకి లాగార‌నీ, నిజం నిగ్గు తేలింద‌ని కాంగ్రెస్ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

కాంగ్రెస్ లోఉత్సాహం...

గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో నైతిక విజ‌యం త‌మ‌దే అంటున్న కాంగ్రెస్ కు, ఈ తీర్పు కూడా కొంత ఉత్సాహాన్ని ఇచ్చే ప‌రిణామ‌మే. ఇక‌, ఈ విష‌యంపై నిందితులు అంద‌రి మీదా హైకోర్టులో ప్ర‌భుత్వ‌మే అప్పీల్ చేయాలంటూ బీజేపీ నేత‌ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి అన్నారు. జ‌య‌ల‌లిత కేసులో కూడా ఇలానే జ‌రిగింద‌నీ, క‌ర్ణాట‌క కోర్టు కొట్టేస్తే.. ఆ తీర్పును సుప్రీం కోర్టు ఈ ఏడాదే కొట్టేసిన సంగ‌తి మ‌ర‌చిపోకూడ‌ద‌న్నారు. ఇక‌, ఈ కేసు మొత్తంలో తమిళ‌నాడులోని విప‌క్షం డీఎంకే నేత‌లే జైలు జీవితం గ‌డిపారు. ఇప్పుడు వీరే నిర్దోషులుగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే దీనికి, రాజ‌కీయంగా ఉన్న లింకుల‌కు మ‌ధ్య ఏదో స్టోరీ ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. డీఎంకే విష‌యంలో ఈ మ‌ధ్య‌కాలంలో బీజేపీ నేత‌ల వైఖ‌రి కొంత సానుకూలంగా మారుతోంది!

ఆ భేటీ తర్వాతే...

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద‌క్షిణాది నుంచి బీజేపీకి ఎంపీల మ‌ద్ద‌తు అవ‌స‌రం. అన్నాడీఎంకే శ్రేణుల్ని న‌మ్ముకుంటే త‌మిళ‌నాడులో బీజేపీకి ఒరిగేదేం ఉండ‌ద‌ని స్ప‌ష్ట‌మౌతోంది. అలాగ‌ని, డీఎంకే ఎప్ప‌ట్నుంచో కాంగ్రెస్ అనుయాయి! ఇప్పుడు కూడా డీఎంకే ని కాంగ్రెస్ వదులుకోదు. అయితే, క‌రుణానిధితో మోడీ భేటీకి.. డీఎంకేతో బీజేపీ పొత్తుకి ఇప్పుడు చాలామంది లింక్ పెడుతున్నారు. మీడియాలో కూడా చాలా విశ్లేష‌ణ‌లు వ‌చ్చేస్తున్నాయి. అయితే, ఇది ఎంత‌మేర‌కు సాధ్య‌ప‌డుతుంది. డీఎంకే సార‌ధి క‌రుణానిధి.. దేవుడే లేడంటారు. బీజేపీ మాత్రం దేవుడే ఈ దేశాన్ని న‌డిపిస్తున్నాడ‌ని అంటారు. మ‌రి ఈ క్ర‌మంలో ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు సాధ్య‌మేనా? మ‌రి 2జీ కేసులో స్టోరీ ఏ మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Similar News