దాని కోసం ఒక్క‌టైన టీడీపీ-టీఆర్ఎస్...!

Update: 2018-02-05 12:30 GMT

నియోజ‌క‌వ‌ర్గాల పెంపు.. తెలుగు రాష్ట్రాల సీఎంల‌ను తెగ టెన్ష‌న్ పెడుతున్న అంశం! ప్ర‌స్తుతం పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఇక ఇప్పుడు త‌ప్పితే నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ఒక నిర్ణ‌యం తీసుకోక‌పోతే భ‌విష్య‌త్‌లో బీజేపీకి ఎలాంటి న‌ష్టం లేక‌పోయినా.. టీడీపీ, టీఆర్ఎస్‌ల‌కు రాజ‌కీయంగా చాలా ప్ర‌మాద‌మే దాగి ఉంది. దీనిని గ‌మ‌నించిన చంద్రులు.. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు కోసం కేంద్రంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా..ఫిబ్ర‌వ‌రి 5న టీడీపీ త‌ర‌ఫున కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి, టీఆర్ఎస్ త‌ర‌ఫున ఎంపీ వినోద్ కుమార్‌.. బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్‌షాతో భేటీ కాబోతున్నారు. దీంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే బ‌డ్జెట్‌లో ఇరు రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రిగినా కిమ్మ‌న‌కుండా ఉన్న నేత‌లకు నేటితో తాడోపేతో తేలిపోనుంది.

అమిత్ షాతో భేటీ.....

తాజా పార్ల‌మెంట్ స‌మావేశాల్లో డీలిమిటేష‌న్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్రంపై టీడీపీ, టీఆర్ఎస్ ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారీ చంద్ర‌బాబు ఈ అంశాన్ని ప్ర‌స్తావించ‌కుండా కేంద్ర పెద్ద‌ల‌తో చ‌ర్చలు జ‌రప‌లేదు. బ‌డ్జెట్‌లోనూ తెలుగు రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రిగినా.. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు జ‌రుగుతుందో లేదోన‌నే ఆందోళ‌నే వీరిలో ఎక్కువగా కన్పిస్తోంది. ఈ నేప‌థ్యంలో తాడోపేడో తేల్చుకునేందుకు ఫిబ్ర‌వ‌రి 5న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతో ప్ర‌త్యేకంగా భేటీ కాబోతున్న‌ట్లు స‌మాచారం. సుజ‌నా చౌద‌రితో పాటు టీఆర్ఎస్‌ ఎంపీ వినోద్ కుమార్ పాల్గొనబోతు న్నారు. ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే డీలిమిటేష‌న్ బిల్లును పెట్టాల‌ని వీరు ప‌ట్టుబట్టనున్నారు.

వలసలను ప్రోత్సహించి....

కేంద్రం పున‌ర్విభ‌జ‌న చేప‌డుతుంద‌న్న ధీమాతో ఇటు టీడీపీ, ఆటు టీఆర్ఎస్ అధినేత‌లు వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించే శారు. పార్టీలో చేరిన వారంద‌రికీ ఏదో ర‌కంగా సీట్ల స‌ర్ధుబాట్లు చేయొచ్చ‌ని భావించారు. నాలుగేళ్ల‌యినా ఆ దిశ‌గా అడుగులు వేయ‌లేదు. దీంతో రెండు పార్టీలు మునిగే ప్ర‌మాదం లేక‌పోలేదు. అందుకే ఇటు వినోద్ కుమార్, అటు సుజ‌నా చౌద‌రి అమిత్ షాను గ‌ట్టిగా నిల‌దీయ‌నున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెంచాలంటే, దాని కోసం ప్ర‌త్యేకంగా చ‌ట్టం చేయాలి. లేనిప‌క్షంలో అన్ని రాష్ట్రాలూ త‌మ అసెంబ్లీ సీట్లు పెంచాల‌ని డిమాండ్ చేసే అవ‌కాశం ఉంది. అయితే విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రెండు రాష్ట్రాల‌కే దీనిని ప‌రిమితం చేస్తారా లేదా అనేదే పెద్ద ప్ర‌శ్న‌!!

అమిత్ షా ఏం తేలుస్తారో....

ఏదైనా త‌మ‌కు లాభం లేక‌పోతే అడుగు ముందుకు వేయ‌ని బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా.. వీరి ఒత్తిడికి తలొగ్గుతారా లేదా అనే సందేహం అంద‌రిలోనూ ఉంది. ఈ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ దొరికితే కానీ డీలిమిటేష‌న్ ప్రక్రియ ప్రారంభం కాదనేది నిపుణుల వాద‌న‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టీడీపీతో బీజేపీ పొత్తుపై సందేహాలున్నాయి. అటు తెలంగాణ‌లోనూ ఇదే ప‌రిస్థితి. పొత్తుల గురించి తేలితేగానీ పున‌ర్విభ‌జ‌నకు మొగ్గు చూపే అవ‌కాశ‌ముంది. పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే తెలంగాణ‌లో అసెంబ్లీ సీట్ల సంఖ్య‌ 119 నుంచి 153కి, ఏపీలో ఉన్న 175 సీట్లు 225కి పెరుగుతాయి. పెంచే సీట్ల‌ను బ‌ట్టి బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తార‌నేది తేలితే, అమిత్ షా ఓ స్ప‌ష్ట‌త ఇచ్చే ఛాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తుంది. మరికాసేపట్లో జ‌రిగే భేటీతో అటో ఇటో అస‌లు ముచ్చ‌ట తేల‌నుందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

Similar News