దగ్గుబాటి జోన్ లో జగన్

Update: 2018-03-07 01:30 GMT

ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇలాకాలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించింది. ప్రకాశం జిల్లా పర్చూరు దగ్గుబాటి ఫ్యామిలీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పర్చూరు నియోజకవర్గం ఆ పార్టీకి అండగా నిలుస్తోంది. 1967 లో పర్చూరు నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటికి పన్నెండు సార్లు ఎన్నికలు జరగ్గా తెలుగుదేశం పార్టీ నాలుగుసార్లు విజయం సాధించింది. దగ్గుబాటి సొంత గ్రామమైన కారంచేడు ఇదే నియోజకవర్గంలో ఉండటంతో ఆ కుటుంబానికి మంచి పట్టుంది.

దగ్గుబాటి ఫ్యామిలీకి పట్టు....

అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావుటీడీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరిన తర్వాత 2004, 2009లో ఆ పార్టీ అభ్యర్థిగా పర్చూరు నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్ల పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ పర్చూరు నుంచి తన కుమారుడిని రంగంలోకి దించాలని యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి భరత్ పై దాదాపు 11వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా గాదె వెంకటరెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర పర్చూరు నియోజకవర్గంలో జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

భరత్ ను ఎమ్మెల్సీగా....

గత ఎన్నికల్లో గొట్టి పాటి భరత్ వైసీపీ తరుపున పర్చూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇంకొల్లులో జరిగిన బహిరంగ సభలో జగన్ గొట్టిపాటి భరత్ కు గట్టి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే గొట్టిపాటి భరత్ ను ఈ జిల్లా నుంచి తొలి ఎమ్మెల్సీగా పంపుతామని చెప్పారు. గొట్టిపాటి భరత్ తనకు తమ్ముడి లాంటి వాడని, భరత్ ను చట్టసభల్లో కూర్చోపెట్టడమే తన లక్ష్యమన్నారు. తన గుండెల్లో భరత్ కు ఎప్పుడూ స్థానం ఉంటుందని, ఆ కుటుంబానికి అండగా నిలుస్తానని చెప్పారు. అంటే వచ్చే ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం టిక్కెట్ గొట్టిపాటి భరత్ కు లేదని తేలిపోయింది.

మంచి స్పందన....

వైఎస్ జగన్ పాదయాత్రకు అద్దంకి నియోజకవర్గంలో మంచి స్పందన లభించింది. ఎక్కడ చూసినా జగన్ రాకం కోసం జనం బారులు తీరారు. అలాగే పర్చూరు నియోజకవర్గంలో కూడా జగన్ యాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది. నియోజకవర్గంలోని ఇంకొల్లు లో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. విశ్వసనీయత ఉన్న నేతలనే వచ్చే ఎన్నికల్లో ఎన్నుకోవాలని, చంద్రబాబు లాంటి మోసగాళ్లను పక్కన పెట్టాలని జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు అడ్డగోలుగా సంపాదించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, వారిని తిరిగి గెలిపించుకునే ధైర్యం కూడా లేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబును క్షమిస్తే రేపు పెద్దమోసాలకు తెరలేపుతారన్నారు. ఇలా పర్చూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర సాగుతోంది.

Similar News