త‌మిళ రాజ‌కీయాల్లో ర‌జ‌నీ సీన్ ఏంటి.... ?

Update: 2018-01-18 16:30 GMT

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి కొత్త‌గా అరంగేట్రం చేస్తున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ జాతకం ఎలా ఉంది? ఆధ్యాత్మిక భావాలు మెండుగా ఉన్న ఆయ‌న రాజ‌కీయంగా ఎంత‌మేర‌కు నెట్టుకురాగ‌ల‌రు ? అసలు పార్టీ పెట్ట‌మ‌ని పోరు పెడుతున్న అభిమానులు ఈ హీరోను రాజ‌కీయంగా ఎంత వ‌ర‌కు హీరోను చేయ‌గ‌ల‌రు? అన్ని ఉచితాల‌తో అంద‌లాలెక్కుతున్న త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ర‌జ‌నీ ఉచితాల‌తో అంద‌లాన్ని అందుకోగ‌ల‌రా ? వీట‌న్నింటినీ నెట్టుకుని వ‌చ్చి.. రాజ‌కీయంగా స్థిర‌ప‌డ‌డం ర‌జ‌నీకి సాధ్య‌మేనా? ఇప్పుడు ఇవ‌న్నీ త‌మిళ‌నాడులో హాట్ హాట్ ప్ర‌శ్న‌లుగా మారాయి. ఏ ఇద్ద‌రు తంబిలు తార‌స‌ప‌డినా ర‌జ‌నీ రాజ‌కీయ‌మే ప్ర‌ధాన టాపిక్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీ రాజ‌కీయ భ‌విత‌వ్యంపై అప్పుడే స‌ర్వేలు, విశ్లేష‌ణ‌లు కూడా ఊపందుకున్నాయి.

రజనీ వల్ల సాధ్యమవుతుందా.

అవేంటో చూద్దాం.. రాష్ట్రంలో ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా అధికారం అనుభ‌వించిన డీఎంకే, ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకేలు రాజ‌కీయంగా చాలా ముందంజ‌లో ఉన్నాయి. ఎవ‌రిని ఎప్పుడు ఒంచాలో? ఎవ‌రిని ఎప్పుడు తుంచాలో ఈ పార్టీల‌కు వెన్న‌తో పెట్టిన విద్య. మ‌రి సునిశిత మ‌న‌స్కుడిగా, అంత‌కు మించి బాబాగా గుర్తింపు పొందిన ర‌జ‌నీ.. రాజ‌కీయ చ‌ద‌రంగంలో పావులు క‌ద‌ప‌డం అంటే ఆయ‌న వ‌ల్ల సాధ్య‌మ‌య్యేప‌నేనా? ఇదే విష‌యాన్ని ఇండియా టుడే-కార్వి ఇన్‌సైట్స్‌ సంస్థ మొత్తం 77 నియోజకవర్గాల్లో స‌ర్వే నిర్వహించ‌డం ద్వారా అధ్య‌య‌నం చేసింది. ర‌జ‌నీ రాజ‌కీయ భ‌విత‌వ్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టింది. ర‌జ‌నీ రాజ‌కీయ ప్ర‌వేశంతో త‌మిళ‌నాడులో పొలిటిక‌ల్ ఈక్వేష‌న్లు ఎంత మేర‌కు మార‌తాయో గ‌ణాంక స‌హితంగా ఈ స‌ర్వే చాటింది.

డీఎంకే అవకాశాలంటూ....

నిజానికి రాష్ట్రంలో 2021లో అసెంబ్లీ ఎన్నిక‌లు రానున్నాయి. ఒక‌వేళ అవి ఇప్ప‌టికిప్పుడే వ‌స్తే.. ర‌జ‌నీ పార్టీ కూడా ఎన్నిక‌ల్లో విజృంభిస్తే.. ప్ర‌స్తుత‌మున్న పార్టీలతో త‌ల‌ప‌డి నిల‌దొక్కుకోగ‌ల సీట్లెన్ని? ప‌్ర‌జ‌లు అభిమానం చూపించ‌గ‌లిగే నియోజ‌క‌వ‌ర్గాలెన్ని? వ‌ంటి విష‌యాల‌పై ఈ స‌ర్వే ప్ర‌ధానంగా దృష్టి పెట్టింది. ఈ ఏడాది ఎన్నికలు జరిగితే ప్రస్తుత అధికార అన్నాడీఎంకేకు 26 శాతం ఓటు షేర్‌తో 68 వరకూ సీట్లు లభించే అవకాశం ఉంద‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఇక‌, విప‌క్షం డీఎంకే కూటమికి 34 శాతం ఓట్‌ షేర్‌తో 134 సీట్లు గెలిచే అవకాశం ఉంద‌ని తేల్చింది.

కేవలం 16 శాతం ఓట్లు మాత్రమే....

ప్ర‌స్తుతం ఇంకా పార్టీని కూడా ప్ర‌క‌టించ‌ని తమిళ సూపర్‌ స్టార రజనీకాంత్‌ పార్టీ.. 16శాతం ఓట్లతో 33 స్థానాల్లో విజయం సాధించవచ్చ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. మొత్తంగా చూసుకున్న‌ప్పుడు రజనీకాంత్‌ ఇప్పటివరకూ పార్టీ పేరును, అజెండాను ప్రకటించలేదు. అయినా కూడా ఆయ‌న‌కు 16% ఓట్ల షేరింగ్ అంటే మాట‌లు కాద‌నేది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న పార్టీ ప్ర‌క‌టించి, జిల్లాల ప‌ర్య‌ట‌న‌, గ్రామాల్లో పాద‌యాత్ర వంటి వాటికి శ్రీకారం చుట్టాల‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ షేరింగ్ డ‌బుల్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వే తేల్చి చెప్పింది. సో.. ఇదీ ర‌జ‌నీ రాజ‌కీయ ముఖ చిత్రం..!

Similar News