తొలిసారి ప్రధాని మోడీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. మోడీ రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాల్లోని నాయకత్వాలను బలహీనపర్చడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని, కేసులు ఉన్నవాళ్లయితే భయపడతారని, తనకు భయం లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆదరణ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు తొలిసారి బహిరంగ సభలో మోడీపై ధ్వజమెత్తారు. అంతేకాదు జగన్, పవన్ కల్యాణ్ ను సయితం దులిపేశారు.
ఎవరికీ భయపడను....
తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఆటుపోట్లు చేశానని, తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. ప్రత్యేక హోదా కావాలని అడిగితే తమిళనాడులో మాదిరిగా ఇక్కడ కూడా జోక్యం చేసుకుంటున్నారని చెప్పారు. తమను ఏమీ చేయలేక బీజేపీ వేరే వాళ్లను రెచ్చగొడుతుందన్నారు. డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఎదురుదాడికి దిగుతున్నారని చెప్పారు. ఇలాంటి వాటికి తాను భయపడబోనని చెప్పారు. ఇప్పటికైనా విభజన హామీలను అమలుపర్చకపోతే ఐదు కోట్ల మంది ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఇది మోడీ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ఇప్పుడే అవినీతి కనపడిందా?
అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన విమర్శలు చేశారు. నాలుగేళ్లుగా కన్పించని అవినీతి ఆయనకు ఇప్పుడే కన్పించిందా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీని ప్రశ్నించకుండా, తనపై బురద చల్లడమేంటని ఆయన సీరియస్ అయ్యారు. మోడీ ఇబ్బంది పెడితే తాను భయపడనని, వేరే వాళ్లు రెచ్చగొడితే తాను పిరికిపందలా పారిపోనని చెప్పారు. రాష్ట్రంలో కొందరు రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని, వైసీపీని నమ్ముకుంటే పుట్టగతులుండవని హెచ్చరించారు. ఈ నాటకాలు తన దగ్గర సాగవన్నారు.