పార్లమెంటు శీతాకాల సమావేశం తొలిరోజే రాజ్యసభ వేడెక్కింది. శరద్ యాదవ్, ఆలీ అన్వర్ ల రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. జేడీయూ నేతలిద్దరిపై అనర్హత వేటు వేయడానికి కారణాలేంటో తెలపాలని పట్టుబట్టింది. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే లోక్ సభ ఇటీవల మృతి చెందిన సభ్యుల కు సభ నివాళులర్పించి సోమవారానికి వాయిదా పడగా, రాజ్యసభలో మాత్రం కాంగ్రెస్ సభ్యులు ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో రాజ్యసభ దద్దరిల్లింది.
వెల్ లోకి దూసుకొచ్చిన...
ఇటీవల జేడీయూ రాజ్యసభ సభ్యులైన శరద్ యాదవ్, ఆలీ అన్వర్ లపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. అయితే సభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు చర్చకు అనుమతించలేదు. దీనిపై చర్చ అవసరం లేదని చెప్పడంతో కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చారు. దీంతో సభను సోమవారినికి వాయిదా వేశారు. అయితే తమ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని అభ్యంతరం వ్యక్తంచేస్తూ శరద్ యాదవ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యసభ ఛైర్మన్ ఆదేశాలను రద్దు చేయాలని శరద్ యాదవ్ కోర్టును కోరారు. మొత్తం మీద తొలిరోజు సమావేశంలోనే కాంగ్రెస్ సభ్యులు సభా కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.