తొగాడియాకు సాగనంపేస్తారా?

Update: 2018-01-21 18:29 GMT

విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియాను సాగనంపేందుకు రంగం సిద్ధమయినట్లు కన్పిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై ప్రవీణ్ తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను చంపేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర పన్నిందని ప్రవీణ్ తొగాడియా ఆరోపించారు. గుజరాత్ పోలీసులు తనను వెంటాడుతున్నారని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రవీణ్ వ్యాఖ్యలపై వీహెచ్ పీ మండిపడింది. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సి కాదని పేర్కొంది.

వీ.హెచ్.పి. మండిపాటు....

స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ లేని ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యలను సహించేది లేదని వీహెచ్ పి నేత చిన్మయానంద్ చెప్పారు. ప్రవీణ్ తొగాడియాకు వీహెచ్ పీలో ఎంతో గౌరవమైన స్థానాన్ని కల్పించామని, అయితే ఆయన దానిని దుర్వినియోగం చేయడం తగదని అన్నారు. విశ్వహిందూ పరిషత్ గౌరవాన్ని మంట గలిపే వారిని ఎవరినైనా సంస్థలో ఉంచబోమని చెప్పారు. వారిని గౌరవంగానే సాగనంపుతామని పరోక్షంగా ప్రవీణ్ తొగాడియాను ఉద్దేశించి అన్నారు.

వివరణ ఇవ్వాలని....

దీంతో ప్రవీణ్ తొగాడియా ను వీహెచ్ పీ నుంచి బయటకు పంపే సమయం ఎంతో దూరం లేదన్న విష‍యం అర్థమైపోతోంది. అయితే ఆయన తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని వీహెచ్ పీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. ఇటీవల గుజరాత్, రాజస్థాన్ పోలీసులు ప్రవీణ్ తొగాడియా కోసం వెదుకులాడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కొద్ది గంటల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగానే ఆయన కేంద్ర సర్కార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Similar News