తేల్చుకుందాం....రా

Update: 2018-03-05 10:30 GMT

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు 17 రోజుల పాటు జరగనున్నాయి. ఈ నిర్ణయాన్ని బీఏసీలో చర్చించి తీసుకున్నారు. ఈ సమావేశాలు బీజేపీ, టీడీపీ మధ్య మరింత దూరం పెంచుతాయా? అన్న అనుమానం తలెత్తుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ఒకవైపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు ఆందోళనలుచేస్తుంటే, ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చోకూడదని నిర్ణయించుకుంది. అందుకోసమే ఏపీకి అందిన సాయంపై చర్చ ఈ సమావేశాల్లో జరపాలని బీజేపీ పట్టుబట్టింది. అయితే ప్రభుత్వం ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు.

లెక్కలతో సహా తేలుస్తాం......

ఇక ఏపీకి కేంద్రం నుంచి ఎంత మేరకు సాయం అందిందో లెక్కలు తీసే పనిలో పడింది బీజేపీ. శాసనసభ సాక్షిగా తమకు అవకాశం వచ్చినప్పుడు గణాంకాలతో సహా వివరిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రాజెక్టులు ఆగిపోవడానికి కారణాలేంటో కూడా ఆధారాలతో సహా నిరూపిస్తామని సవాల్ విసిరారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకున్నారన్నారు. అసలు ప్రత్యేక హోదాను 11 రాష్ట్రాలకు పొడిగించిన విషయం అబద్ధమని బీజేపీ నేతలు తేల్చేశారు. కావాలని ప్రచారం చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో అన్ని విషయాలను చర్చిస్తామని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు తెలిపారు.

ఫ్లెక్సీలపై మండిపాటు.....

ఇక ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. విజయాడ పట్టణంలోనూ, అసెంబ్లీకి వెళ్లే దారుల్లో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మోడీని, కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఫ్లెక్సీలపై ఉండటంతో బీజేపీ నేతలు మండిపడుతున్నాు. మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయాన్ని తాము సీరియస్ గా తీసుకుంటున్నామని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. టీడీపీ నేత వ్యక్తిగతంగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారా? లేక పార్టీ అనుమతి తీసుకునే చేశారో చెప్పాలన్నారు. ఈరోజు జరగబోయే సమావేశాల్లో అమితుమీ తేల్చుకుంటామంటున్నారు కమలనాధులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Similar News