తెలుగులో ఈమెయిల్ అంటూ బురిడీ కొట్టిస్తున్నారు!

Update: 2016-10-19 08:30 GMT

ప్రజలలో ఇంటర్నెట్ వినియోగం, టెక్నాలజీ ప్రియత్వం పెరిగే కొద్దీ వారికి సేవలు అందించే పేరిట రకరకాల కొత్త సంస్థలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఏదో ఒక కొత్తమాట చెబుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వీరిలో 90 శాతం వరకు సూటిగా వ్యవహరించడం అంటూ ఉండదు. ఏదో ఒక మెలిక పెట్టి, వినియోగదారుడికి తెలియకుండా, అతడి జేబును కొల్లగొట్టే మార్గాలనే చూసుకుంటూ ఉంటాయి. అందుకే టెక్నాలజీ ప్రియత్వం మంచిదే గానీ.. దాన్ని అందిపుచ్చుకోవడంలో చాలా జాగ్రత్త వహిస్తుండాలి. కానీ కొన్ని పెద్ద సంస్థల పేరిట ప్రకటనలు వచ్చినప్పుడు జనం సహజంగానే మాయలో పడుతుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.

ఇన్ఫోసిస్‌కు అనుబంధ సంస్థగా చెప్పుకునే డేటా ఎక్స్ జెన్ టెక్నాలజీస్ వారు.. తెలుగులో ఉచితంగా ఈమెయిల్ సర్వీసు ఇస్తున్నట్లుగా చాలా ఘనంగా ప్రకటించింది. అంటే జీమెయిల్ లో మనం ఇంగ్లిషు పేరుతో మెయిల్ అకౌంట్ పెట్టుకున్నట్టుగానే.. డేటామెయిల్ వారి సర్వర్ లో తెలుగు పేరుతో మెయిల్ ఎకౌంట్ పెట్టుకోవచ్చునన్నమాట. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఉచిత స్థానిక భాషల మెయిల్ సర్వీసును ప్రారంభిస్తున్నట్లు సంస్థ చెప్పుకుంది. తొలిదశలో 8 భాషల్లో మెయిల్ సర్వీసు ప్రారంభించారు. అయిదు భారతీయ భాషలు, ఇంగ్లిషు సహా మూడు విదేశీ భాషలు ఉన్నాయి. ప్రధాని మోదీ సంకల్పిస్తున్న డిజిటల్ ఇండియా దిశగా ఇది చాలా పెద్ద ముందడుగు అని కూడా సంస్థ తమ గురించి తాము ఘనంగా చెప్పకుంది.

అయితే ఇందులో మాయ ఏంటంటే.. ఈ సంస్థ మెయిల్ సర్వీసును విండోస్ వినియోగదారులకు ఇవ్వకపోవడం. కేవలం ఆండ్రాయిడ్ , ఐఓఎస్ లను వాడే వారికి మాత్రమే అందుబాటులో ఉండేలా సర్వీసును ప్లాన్ చేశారు. విండోస్ ప్లాట్‌ఫారం ను అనుమతించకపోవడం అంటే.. కంప్యూటర్ల మీద వాడే వారికి ఈ వెసులు బాటు ఉండదన్నమాట. ఇలా కేవలం ఫోన్లలో వాడే వారిని మాత్రమే కాన్సంట్రేట్ చేస్తున్నారంటే.. వారి బిజినెస్ మోడల్ లోనే ఏదో మాయ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Similar News