తెలంగాణ‌లోనూ `గుజ‌రాత్ ఫార్ములా`

Update: 2017-12-23 05:30 GMT

గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. నైతికంగా విజయం సాధించి మంచి జోష్‌లో ఉంది కాంగ్రెస్!! ఇవి ఆ పార్టీ నేత‌ల్లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపాయ‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇదే ఉత్సాహాన్ని కొన‌సాగించాల‌ని ఆ పార్టీ నేత‌లు ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా తాము బ‌లంగా ఉన్న రాష్ట్రాల్లో గుజ‌రాత్ త‌ర‌హా యాక్ష‌న్ ప్లాన్ అమ‌లు చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ నేత‌ల చూపు తెలంగాణ వైపు ప‌డింది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏమాత్రం లేక‌పోయినా.. తెలంగాణ‌లో బ‌లంగా ఉంద‌ని అధిష్ఠానం న‌మ్ముతోంది. టీఆర్ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని.. కొద్దిగా క‌ష్ట‌ప‌డితే విజ‌యం ద‌క్కించుకోవ‌డం సాధ్య‌మ‌ని.. నేత‌లు ఇప్ప‌టికే రిపోర్టులు పంపారు. దీంతో గుజ‌రాత్ ప్లాన్‌ను అచ్చుగుద్దిన‌ట్టు దింపేయాల‌ని డిసైడ్ అవుతున్నారు కాంగ్రెస్ నాయ‌కులు!!

పోరాడి ఓడిన తీరు...

గుజరాత్‌ ఎన్నికల ప్రచారం దేశ వ్యాప్తంగా పొలిటికల్‌ హీట్‌ పెంచింది. ఇప్పుడు అక్కడ వచ్చిన ఫలితాలు కూడా వేడి పెంచుతున్నాయి. ప్రధాని మోదీ, అమిత్‌షాల సొంత ఇలాకాలో కాంగ్రెస్ పోరాడిన తీరు.. అంద‌రితో ప్ర‌శంస‌లు అందుకునేలా చేసింది. ముఖ్యంగా హార్దిక్ ప‌టేల్, మేవాని, జిగ్నేష్ త్ర‌యంతో క‌లిసి.. రాహుల్ చేసిన ప్ర‌చారానికి ఓట‌ర్లు ముగ్ధుల‌య్యారు. అయితే ఈ ఎన్నిక‌ల్లో గెలుపు బీజేపీని వ‌రించినా.. కాంగ్రెస్ అధికారానికి ఒక‌డుగు దూరంలోనే నిలిచిపోయింది. అంతేగాక మోదీ-అమిత్‌షా ద్వ‌యానికి చెమ‌ట‌లు పట్టించారు రాహుల్‌! అధికారం దక్కకపోయినా ప్రధానిని కలవరపాటుకు గురిచేశారు. ఇదే టీకాంగ్రెస్ నాయ‌కుల్లో ఆత్మ‌స్థైర్యాన్ని నింపుతోంది!

రాహుల్ ప్రచారం వల్లనే...

2019 ఎన్నికలకు టీ కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే సమాయాత్తం అవుతోంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గుజరాత్‌లో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ సంధించిన ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని నేతలు భావిస్తున్నారు. గుజరాత్‌ ఎన్నికలను తెలంగాణ పాలిటిక్స్‌తో మిక్స్‌ చేస్తూ అధికారం చేజిక్కించుకోవాలని ఆశపడుతున్నారు. రాహుల్‌ దెబ్బకు ప్రధాని మోదీ, అమిత్‌షా.. రాష్ట్ర నేతలను తలపిస్తూ ప్రచారాన్ని చేశారని తెలంగాణలోని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. రాహుల్‌ను ఎదుర్కొనేందుకు మోదీ, అమిత్‌షాతోపాటు 182 మంది ప్రముఖులను రంగంలోకి దింపారని.. గుజరాత్‌లో తాము ఓడినా నైతిక విజయం తమదేనని వాదిస్తున్నారు.

ఇక్కడ ఈ ముగ్గురితోనూ...

గుజరాత్‌లో రాహుల్‌గాంధీ అమలు చేసిన ఫార్ములాను తెలంగాణ పాలిటిక్స్‌కు మిక్స్‌ చేసి కాంగ్రెస్‌ నేతలు మరీ విశ్లేషిస్తున్నారు. అక్కడ హార్థిక్‌పటేల్‌, అల్ఫేష్‌ ఠాకూర్‌, జిగ్నేష్‌ మేవానిలాంటి త్రయంలానే తెలంగాణ‌లోనూ ఉన్నార‌ని చెబుతున్నారు. టీఆర్ఎస్‌, సీఎం కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న‌ కోదండరాం, మందకృష్ణ మాదిగ, ఆర్‌. కృష్ణయ్య‌తో క‌లిస్తే ఫ‌లితాలు మ‌రింత మెరుగ్గా ఉంటాయ‌ని ఆశాభావం వ్య‌క్తంచేస్తున్నారు. సామాజిక ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన తెలంగాణలో ఇప్పటికే కొనసాగుతున్న సంఘాలు, ఉద్యమ నాయకులు కాంగ్రెస్‌తో కలిసి నడుస్తారన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

ఇదే జరిగితే గెలుపు తమదేనని...

తెలంగాణలో 90శాతం ఓట్లలో టీఆర్‌ఎస్‌ - కాంగ్రెస్‌ మధ్య కేవలం 5 శాతమే తేడా ఉందని.. మిగిలిన పది శాతం ఓట్లలో మిగిలిన పార్టీలు ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలు అంచనా గడుతున్నారు. కేసీఆర్‌ను గద్దె దింపాలంటే ఆ మిగిలిన పది శాతంలో ఉన్నవారు.. కాంగ్రెస్‌ వైపు చేరుతారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటున్న టీజేఏసీ చైర్మన్‌ కోదండరాంను హార్థిక్‌పటేల్‌తో పోల్చుతున్నారు. బీసీ, ఎస్సీల ఉద్యమ నేతలుగా ఉన్న ఆర్‌. కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ కాంగ్రెస్‌తో కలిసి నడిచే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్‌ను గద్దె దింపేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని చెబుతున్నారు. ఇప్పటికే ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి ఉండ‌నే ఉన్నాడు. ఇక ఈ ముగ్గురినీ త‌మ వెంట ఉంచుకోగ‌లిగితే విజ‌యం ఖాయ‌మ‌ని విశ్లేషిస్తున్నారు.

Similar News