తెలంగాణ‌లో హంగ్.. ఓయూ విద్యార్థుల షాకింగ్ స‌ర్వే?

Update: 2017-12-22 11:30 GMT

ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌గానే రెండు రాష్ట్రాల్లో స‌ర్వేలు జోరందుకున్నాయి. అంత‌ర్గ‌తంగా పార్టీ నాయ‌కులు వివిధ స‌ర్వేలు చేస్తూ నేత‌ల జాతకాలన్నీ చూస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ విజ‌యం సాధిస్తుంది! ఏపీలో సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తెలంగాణ‌లో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా టీఆర్ఎస్‌దే విజ‌య‌మ‌ని సీఎం కేసీఆర్ ప‌దేప‌దే చెబుతున్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని, త‌మ‌కే ప‌ట్టం క‌డ‌తార‌ని ఈసారి 100కు పైగా స్థానాలు ఖాయ‌మ‌ని ధీమాగా ఉన్నారు. మ‌రి ఈ లెక్క‌ల‌న్నీ నిజ‌మేనా? తెలంగాణ‌లో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీఆర్ఎస్‌కు ఎన్నిసీట్లు వ‌స్తాయ‌నే అంశంపై ఉస్మానియా వ‌ర్సిటీ విద్యార్థి బృందం స‌ర్వే చేసింది. ఇందులో దిమ్మ‌తిరిగే ఫ‌లితాలు వ‌చ్చాయి. తెలంగాణ‌లో హంగ్ త‌ప్ప‌ద‌ని ఇందులో తేలింది!!

టీఆర్ఎస్ కు 46సీట్లేనా?

టీఆర్ఎస్‌ది ఆత్మవిశ్వాస‌మా లేక అతి విశ్వాస‌మా అంటే.. రెండోదో స‌రైనది అంటోంది ఓయూ విద్యార్థి బృందం. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుంద‌ని తేలింది. టీఆర్ఎస్ కు కేవలం 46 సీట్లు వస్తాయని తేల్చింది. ఇక కాంగ్రెస్‌కు అత్య‌ధికంగా 56 సీట్లు, బీజేపీ-8, మజ్లిస్‌-7, టీడీపీ-2, సీపీఎం-1 సీటు వస్తాయని తేలింది. ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పాటు ఖాయమని తేల్చింది. రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమని చెప్పడం అంతటా చర్చనీయాంశమైంది. ఏయే జిల్లాల్లో ఏయే నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న వివరాలు కూడా వీరు బ‌య‌ట‌పెట్టారు.

నల్లగొండలో కాంగ్రెస్ దే హవా...

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాలుగు స్థానాలు గెలుస్తాయ‌ట‌. నల్లగొండ, మునుగోడు, నార్జునసాగర్, హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తి, దేవరకొండ, సూర్యాపేటల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, నకిరేకల్, మిర్యాలగూడ, ఆలేరు, భువనగిరిలలో టీఆర్‌ఎస్ గెలుస్తుందని సర్వే పేర్కొంది. టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాలు మంత్రి జగదీష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గాలైన తుంగతుర్తి, మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తార‌ట‌. ఇక నకిరేకల్, ఆలేరు, భువనగిరి సిట్టింగ్ స్థానాలను టీఆర్‌ఎస్ నిలబెట్టుకోనుందని సర్వే తెలిపింది.

జంప్ జిలానీలకు షాక్...

గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే న‌ల్ల‌మోతు భాస్కర్ రావు నియోజకవర్గంలో ఈ దఫా టీఆర్‌ఎస్ గెలుస్తుందని సర్వే తేల్చింది. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ అభ్యర్ధిగా గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నియోజకవర్గం దేవరకొండలో ఎదురుగాలి వీస్తుందట. అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని ఆ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలైన హుజూర్‌నగర్, నల్లగొండ, సాగర్, కోదాడలను ఆ పార్టీ నిలబెట్టుకోవడంతో పాటు మునుగోడు, దేవరకొండ, తుంగతుర్తిల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఓయూ విద్యార్థి సర్వేలో పేర్కొనడం రాజకీయ పార్టీల్లో రచ్చ జరుగుతోంది. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Similar News