ప్రపంచ తెలుగు మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా నలభై నిమిషాల డాక్యుమెంటరీని ప్రభుత్వం రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే డాక్యుమెంటరీని సిద్ధం చేశారు. నలభై నిమిషాల నిడివిగల ఈ డాక్యుమెంటరీ తెలంగాణ మట్టివాసనలు వెలువడేలా రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ డాక్యుమెంటరీకి ప్రభుత్వం రెండున్నర కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. సినీదర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, నందినిరెడ్డిలు స్వయంగా డాక్యుమెంటరీ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. నలభై నిమిషాల ఈ డాక్యుమెంటరీనీ పగలూ రాత్రీ చిత్రీకిరిస్తున్నారు.
40 నిమిషాల డాక్యుమెంటరీ.....
ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 15 వతేదీ నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానున్నాయి. ఈ మహాసభల సందర్భంగా తొలిరోజు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించాలని కేసీఆర్ నిర్ణయించారు. గతకొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, జీవనశైలితో పాటు ఇక్కడి పండుగలు, కళారూపాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చనున్నారు. డాక్యుమెంటరీలో హీరో విజయ్ దేవర్ కొండ ఒక హోలీ పాటలో కన్పించనున్నారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకూ జరిగే కార్యక్రమాల్లో ప్రతిరోజూ దీనిని ప్రదర్శించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో దక్కన్ వంటకాల విశిష్టతతో పాటు నిజాం, జైన్, తెలంగాణ పండగలైన బతుకమ్మ, బోనాలు, మేడారం, సమ్మక్క, సారక్క, హోలీ, నాగోబా, రంజాన్ వంటి పండగల ప్రాశస్త్యాన్ని కూడా వివరించానున్నరాు. దీంతోపాటు తెలంగాణ హస్తకళలను, జానపదాలను కూడా చూపనున్నారు. అలాగే నిర్మల్ పెయింటింగ్స్, పెంబర్తి నగిషీలతో పాటు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా చూపుతారు. తెలంగాణ కవుల విశిష్టతను కూడా తెలియజేస్తారు. చేనేత వస్త్రాలు, ఇక్కత్ శాలువా, గొల్లభామ చీరల వంటి వాటిని హైలెట్ చేస్తారు. ఇక తెలంగాణ వంటకలను గురించి కూడా డాక్యుమెంటరీలో పొందుపర్చనున్నారు. మొత్తం మీద ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ డాక్యుమెంటరీ హైలెట్ కానున్నట్లు తెలిసింది. కేసీఆర్ పూర్తిగా చూసి ఓకే చేసిన తర్వాతనే డాక్యుమెంటరీని ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శించనున్నారు.