తెలంగాణలో హీట్ మొదలయిందే....!

Update: 2018-01-30 06:30 GMT

వచ్చే ఎన్నికల్లో 70 సీట్లతో అధికారంలోకి వస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత తెలంగాణలో ఉందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజలు ఇప్పటికే అధికారపార్టీపై అసంతృప్తులు వెళ్లగక్కుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలను అవలంబిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న మాటే గాని స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు తెలంగాణ ప్రజలకు దక్కలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తాము చేయించిన సర్వేలో కాంగ్రెస్ 70 స్థానాల్లో సునాయాస విజయం సాధిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా పట్టుకోల్పోతామని తెలిసినా కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

హరీశ్ కౌంటర్....

అయితే దీనిపై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. పదేళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వచ్చి తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 70 సీట్లు గెలుస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ప్రగల్భాలుగా కొట్టిపారేశారు. ఈ నాలుగేళ్లలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కన్నా ఎన్ని రంగాల్లో ముందంజలో ఉందో కాంగ్రెస్ నాయకులకు తెలుసా అని ప్రశ్నించారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రాజెక్టులను ఆపేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని మండి పడ్డారు హరీశ్.

ఇక యాత్రల జాతర.....

ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరులోనే వస్తాయని సంకేతాలు రావడంతో తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలయింది. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమంటూ ఇరు పార్టీల నేతలూ ప్రకటించుకుంటున్నారు. ఎన్నికల కోసం అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేసీఆర్ జిల్లాల పర్యటన రెండు, మూడు రోజుల్లో ఖరారు కానుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

Similar News