తెలంగాణలో స్థానికత మారనుంది. ఈ మేరకు స్థానికత విషయంలో కొన్ని మార్పులు తీసుకొచ్చేందుకు టీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకూ వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికత లభించేటట్లుగా కొత్త చట్టం టిసర్కార్ తేనుంది. కడియం శ్రీహరి సారథ్యంలో నియమించిన జోన్ల కమిటీ ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లింది. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిదే కొత్త స్థానికతకు సంబంధించిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
వరుసగా నాలుగేళ్లు.....
ఇప్పటి వరకూ నాలుగో తరగతి నుంచి పదో తరగతి లోపు ఎక్కడ ఏడేళ్ల పాటు చదవులో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికత వర్తిస్తుంది. అయితే దీనివల్ల కొందరికి స్థానికత ఇబ్బందిగా మారింది. ఆరో తరగతి తర్వాత మంచి చదువు కోసం తమ పిల్లలను ఇతర ప్రాంతాలకు తల్లిదండ్రులు పంపుతున్నారు. దీంతో ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి పుట్టింది ఒక జిల్లాలో, స్థానికత మరో జిల్లాలో వస్తుంది. ఇప్పటికే తెలంగాణలో పది జిల్లాల నుంచి 31 జిల్లాలకు పెంచారు.
ఉద్యోగాల నియామకాల్లో కూడా....
దీంతో అనేకమంది ఉద్యోగాల విషయంలో స్థానికత సమస్యను ఎదుర్కొంటున్నారు. అందుకోసం స్థానికత కోసం ఏర్పాటు చేసిన కమిటీ కొన్ని సిఫార్సులను చేసింది. సాధారణంగా ఎక్కువ మంది ప్రాధమిక విద్యను సొంత ప్రాంతంలోనే పూర్తి చేస్తారు. అందుకే ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకూ చదువులో నాలుగేళ్లు వరుసగా ఎక్కడ చదివితే అక్కడే స్థానికత వర్తించేలా నిబంధనలను సవరించనున్నారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకూ నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే జిల్లాలో స్థానికత వర్తిస్తుంది. ఉద్యోగాల విషయంలోనూ ఇదే నిబంధనను అనుసరిస్తారు. అయితే ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి అంగీకరించాల్సి ఉంటుంది.