తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు?

Update: 2018-01-30 04:30 GMT

తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు? ప్రస్తుత సీఎస్ ఎస్పీసింగ్ రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్రం నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి స్పందనలేకపోవడంతో కొత్త సీఎస్ గా ఎవరనేది చర్చనీయాంశమైంది. అయితే సీనియర్ అధికారి అయిన ఎస్.కె. జోషి పేరు దాదాపు ఖరారయినట్లేనని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాల్గవ చీఫ్ సెక్రటరీ పేరును ఈరోజు ఖరారు చేయనున్నారు.

రేపటితో ముగియనున్న ఎస్పీసింగ్ పదవీకాలం....

తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగుస్తుంది. ఆయన పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే ఇంతవరకూ పొడిగింపుపై ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో కొత్త సీఎస్ నియామకం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొత్త సీఎస్ పదవి కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. అనేకమంది సీనియర్లు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ‌ సెక్రటరీ ఎస్ కే. జోషీ పేరుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు.

రేసులో అనేకమంది....

ఆయన పూర్తి పేరు శైలేంద్రకుమార్ జోషీ. జోషి 1984 బ్యాచ్ కు చెందిన అధికారి. ప్రస్తుతం నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ‌ సెక్రటరీగా పనిచేస్తున్న జోషి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల పనుల్లో నిర్మాణాత్మక పాత్రను పోషించారు. 2019 డిసెంబరు వరకూ ఆయన సర్వీసులో ఉంటారు. ఆయన ముఖ్యమంత్రి మన్ననలను కూడా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో పొందారు. అందుకే కేసీఆర్ జోషి పేరు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే జోషి తో పాటు సీఎస్ పదవిని ఆశించేవారిలో ఆయనకంటే సీనియర్ అయిన బి.పి. ఆచార్య కూడా ఉన్నారు. ఆచార్య 1983 బ్యాచ్ కు చెందిన అధికారి. ఆచార్య పదవీకాలం 2020 అక్టోబర్ వరకూ ఉంది. ఆచార్య ప్రస్తుతం చెన్నారెడ్డి మానవవనుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే వైఎస్ హయాంలో ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో ఆచార్య సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నరాు. దీంతో ఆయనను పక్కన పెట్టే అవకాశాలున్నాయి.అలాగే బీపీ ఆచార్య సతీమణి, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రాజీవ్ రంజన్ ఆచార్య కూడా సీఎస్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఆమె కూడా 1983 బ్యాచ్ అధికారిణి. ఆమెకు 2018 అక్టోబర్ తో పదవీకాలం ముగుస్తుంది. అలాగే ఇదే బ్యాచ్ కు చెందిన బినయ్ కుమార్ కూడా ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం కేంద్రసర్వీసుల్లో ఉన్నారు. అలాగే సీఎస్ రేసులో బీఆర్ మీనా, శైలంద్రకుమార్, అజయ్ మిశ్రాలు ఉన్నారు. అయితే వీరందరిలో జోషివైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈరోజు కొత్త సీఎస్ ఎవరనేది తేలిపోనుంది.

Similar News