తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టింది. స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న దాదాపు 1200 మంది ఉద్యోగులను రిలీవ్ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆంధ్రప్రదేశ్ లో స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే రెండు రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్ కో, జెన్ కోలు ఇప్పటికే ఉన్న కమిటీలతో కాని, కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుని కాని ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది.
రిలీవ్ చేసిన ఉద్యోగులను...
విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియ ముగిసేంత వరకూ రిలీవ్ చేసిన 1200 మంది ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించాలని ఆదేశించింది. స్థానికత లాంటి వివక్ష లేకుండా వారికి పదోన్నతులను కల్పించడమే కాకుండా, వృత్తిపరమైన పదోన్నతులు కల్పించాలని కోరింది. రిలీవ్ చేసిన ఉద్యోగుల సీనియారిటీని కూడా తక్షణమే పునరుద్ధరించాలని కోరింది. తమను అన్యాయంగా రిలీవ్ చేశారంటూ ఏపీకి చెందిన విద్యుత్తు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
పుట్టిన ఊరు ఆధారంగా.....
తెలంగాణ విద్యుత్తు సంస్థలు ఏపీ ప్రభుత్వంతో సంప్రదించకుండా మార్గదర్శకాలను రూపొందించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఉద్యోగుల విభజన వ్యవహారంలో కమలనాధన్, ప్రత్యూష్ సిన్హా కమిటీలు చెప్పిన విధానాన్ని తెలంగాణ అనుసరించలేదని అభిప్రాయపడింది. ఏపీ పునర్విభజన చట్టంలో చెప్పిన ప్రకారం అనుసరించలేదని పేర్కొంది. ఉద్యోగుల ఉండే ప్రాంతాన్ని గుర్తించి అర్హత కల్పించే అధికారం ఒక్క పార్లమెంటుకే ఉందని పేర్కొంది. పుట్టిన ప్రాంతం ఆధారంగా ఉద్యోగులను అనర్హులుగా ప్రకటించేందుకు రాజ్యాంగం ఒప్పుకోదని తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణ సర్కార్ కు మళ్లీ తలనొప్పి ప్రారంభమయింది.