తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయిని దాటిపోతోంది. పోకచెక్కతో నువ్వొకటంటే.. తలుపుచెక్కతో నే రెండంటా- అన్న సామెతను గుర్తు చేస్తున్నాయి అధికార, విపక్షాలు. నీకేనా నోరుంది.. మాకు లేదా.. అని ఒకపార్టీపై మరొక పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతు న్నాయి. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌లపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడి న విషయం తెలిసిందే. అయితే, ఇది రానురాను తీవ్రస్థాయి ఆరోపణలు ప్రత్యారోపణలకు కారణమైంది. మేం తక్కువ తిన్నామా? అని అధికార పార్టీ మంత్రులే లైన్‌లోకి దిగిపోయి కాంగ్రెస్‌ని తూర్పార పట్టారు.
ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో.....
విషయంలోకి వెళ్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఐటీ మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులపై పలువురు టీఆర్‌ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిది కాలకేయ ముఠా అని, కాంగ్రెస్‌ది బుట్టేచోర్ బ్యాచ్ అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు కాదు కదా కనీసం ఏడు సీట్లయినా గెలుచుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సవాలు చేశారు. రాష్ట్రాన్ని ధర్మరాజులా పరిపాలిస్తున్న సీఎం కేసీఆర్‌పై ఈర్ష్యాద్వేషాలతోనే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
గడ్డాలు మీసాలు పెంచుకుంటే.....
ప్రజల మనసులో ఉన్నమాటనే మంత్రి కేటీఆర్ చెప్తే, కాంగ్రెస్ నాయకులు ఉలిక్కిపడుతూ, వ్యర్థప్రేలాపనలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. గడ్డాలు మీసాలు పెంచుకొంటే సీట్లు గెలుస్తామనుకోవడం భ్రమే అవుతుందని ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కంటే వందరెట్లు అద్భుతంగా పాలిస్తున్నారని.. కాంగ్రెస్ నాయకులు ఈర్ష్య, అక్కసుతో ఏదిపడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. గొర్రెలు మేకలు పంచుతారా? అని విమర్శిస్తున్న నేతలు యాదవుల దగ్గరికిపోయి అడిగితే వారే బుద్ధిచెప్తారని హెచ్చరించారు.
సవాల్ విసిరింది....
మంత్రి తారకరామారావు తన రాజకీయ జీవితాన్ని పణంగాపెట్టి రిటైర్‌మెంట్ దశలో ఉన్న ఉత్తమ్‌కు సవాల్ విసిరారని, అయినా నేరుగా స్పందించలేదని చెప్పారు. తెలంగాణను సోనియాగాంధీ ఊరికే ఇచ్చారా? అని ప్రశ్నించారు. పోరాటాల సెగ ఢిల్లీకి తగిలిన తర్వాతనే తెలంగాణ ఇచ్చారని.. అయినా ఆ పార్టీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలుసుకోవాలని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలే గాఢ్‌ఫాదర్స్ అని పేర్కొన్నారు. మంత్రి తలసాని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఒకపార్టీపై ఒకరు విమర్శలు చేసుకోవడం కామనే అయినా.. ఇలా వ్యాఖ్యానించుకోవడం ఎంతమేరకు సమంజసమని అంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అలాగే సుదీర్ఘ అనుభవం సొంతం చేసుకున్న కేసీఆర్‌లు కూడా ప్రజల్లో చులకన అవడం ఎంత మేరకు సమంజసమో తరచి చూసుకోవాలనే డిమాండ్లు కూడా సోషల్ మీడియాల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే ఇలా రోడ్డున పడి హంతకులు, దొంగలు అనుకోవడం ఏమంత సమంజసంగా లేదనేది నెటిజన్ల ఉవాచ మరి ఈ నేతలు వీరి మాటలు వినిపించుకుంటారా? సందేహమే!