వెండితెర మీద రొమాన్స్ పండించడం అంటే.. అందులో ఒక్కొక్క దర్శకుడిది ఒక్కొక్క శైలి.. ఫరెగ్జాంపుల్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అయితే... కథానాయికల నాభీసౌందర్యాన్ని... పూలు పండ్లతో స్పృశించకుండా రొమాన్స్ పర్వం పరిపూర్ణం కాదు. అదే బాలీవుడ్ దిగ్గజాలు సుభాష్ ఘయ్, మహేష్ భట్ లు రొమాన్స్ ను పండించడంలో తమదైన శైలి చూపిస్తుంటారు. రాజకపూర్ ఎంత విశృంఖలతకు పెద్దపీట వేస్తారో కూడా అందరికీ తెలుసు. అన్నీ సంగీత నృత్య కళాత్మక అవార్డు చిత్రాలు తీసే అగ్రదర్శకుడిగా అనుకుంటాం గానీ.. కె.విశ్వనాధ్ చిత్రీకరణను లోతుగా గమనిస్తే.. అందులో దోబూచులాడే శృంగారాత్మకత స్పష్టంగా తెలిసి వస్తుంది. అయితే... నవతరం సినిమా దర్శకులకు మన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ... వెండి తెర మీద అందంగా రొమాన్స్ పండించడం ఎలాగో తనదైన శైలిలో పాఠం చెబుతున్నారు.
హీరోయిన్లను తాకకుండానే రొమాన్స్ ను పండించవచ్చునని వెంకయ్యనాయుడు అంటున్నారు. హింస, అశ్లీలత లకు తావు లేకుండా మంచి సినిమాలు తీస్తే సమాజానికి మంచి జరుగుతుందని వెంకయ్య చెబుతున్నారు. అనవసరంగా హీరోయిన్లను అసభ్యంగా చూపించడం తగదని ఆయన దర్శకులను కోరుతున్నారు. గోవాలో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు ఇలా ఇండస్ట్రీకి రొమాంటిక్ దిశా నిర్దేశం చేయడం విశేషం.
కురచ దుస్తులు, అంగాంగ ప్రదర్శనలు మాత్రమే రొమాన్స్ కాదని, పెదవులు, కళ్లు, ముక్కు చూపులతో కూడా రొమాన్స్ పండించవచ్చునని వెంకయ్యనాయుడు హితోపదేశం చేశారు. ఆయన సినిమా మేకింగ్ గురించి.. ఎబ్బెట్టుగా ఉండకుండానే రొమాన్స్ పండించగల మార్గాల గురించి చెబుతోంటే... అచ్చంగా.. ఆయన రాజకీయాల్లోకి వెళ్లబట్టి సరిపోయింది గానీ.. లేకపోతే.. సినిమా ఇండస్ట్రీలో మరో దిగ్గజంగా ఉండే వారేమో అని ఫెస్టివల్ అతిథులకు అనిపించి ఉంటే ఆశ్చర్యం ఏముంది?