తెగ ఫీలయిపోతున్న తెలుగుదేశం...!

Update: 2017-10-29 07:30 GMT

తెలుగుదేశం పార్టీ తెగ బాధపడిపోతోంది. నిన్న రేవంత్ ను ఒక్కమాట కూడా అనని నేతలు ఇప్పుడు వాయిస్ పెంచేశారు. రేవంత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేశారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెగ ఫీలయిపోతున్నారు. 1985లో ఇందిరాగాంధీతో చేతులు కలిపి నాదెండ్ల భాస్కరరావు తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిస్తే... 2017లో రాహుల్ తో కలిసి టీడీపీకి రేవంత్ రెడ్డి ద్రోహం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యే. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు కూడా పెద్దగా స్పందించని పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం కొంత బెరుగ్గానే ఉన్నట్లు కన్పిస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ నేతలు పార్టీని వీడి వెళ్లినా పెద్దగా స్పందించలేదు. వారు వెళ్లింది టీఆర్ఎస్ లోకి. కాని రేవంత్ ఇప్పుడు వెళుతుంది కాంగ్రెస్ పార్టీలోకి. అందుకే టీటీడీపీ నేతలకు రుచించనట్లుంది.

నష్టం లేదంటూనే.....

రేవంత్ రెడ్డి పార్టీ వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని పైకి బీరాలు పోతున్నా... లోలోపల మాత్రం పార్టీకి భారీగా డ్యామేజీ అవుతుందని భావిస్తున్నారు. రేవంత్ వెంట అనేక మంది నేతలు వెళతారన్నది ఒక బాధకాగా... తెలుగుదేశం పార్టీ గురించి, నేతల లోగుట్టులన్నీ రేవంత్ కు తెలియడమే అసలు భయంగా కన్పిస్తుంది. మరోవైపు పక్క రాష్ట్రంలో ఇదే తెలుగుదేశం పార్టీ 20 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి చేర్చుకోవడం నైతికత అవుతుందా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. 20 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు బలమైన ప్రతిపక్షంగా ఉన్న జగన్ ఎంత బాధపడి ఉంటారో ఇప్పుడు చంద్రబాబుకు అర్థమయి ఉంటుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రాజకీయాలంటేనే... ఇప్పుడు... అధికారం... భవిష్యత్తు చూసుకోవడమే. టీడీపీకి తెలంగాణలో ఇక భవిష్యత్ లేదని తెలిసే రేవంత్ తన దారి తాను చూసుకున్నారు. మొత్తం మీద రేవంత్ ఎగ్జిట్ తో తెలుగుదేశం పార్టీకి మాత్రం భారీ దెబ్బే తగలనుంది.

Similar News