సైబర్ నేరగాళ్ళు నానాటికీ తెలివి మీరుతున్నారు... ఎదుటి వారికి ఏమాత్రం అనుమానం రాకుండా అందినకాడికి కాజేస్తున్నారు... హెర్బల్ విత్తనాల పేరు చెప్పి ఏకంగా ఓ మాజీ వ్యవసాయ శాస్త్రవేత్తకే రూ.48 లక్షలు టోకరా వేశారు... ఈసారి సైబర్ నేరగాళ్ళు బాధితుడిని నేరుగా కలవడం కొసమెరుపు... మరికొంత మొత్తం కాజేసే క్రమంలో ఉండగా విషయం బాధితుడి కుమారులకు తెలియడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై గత నెల 30న కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ పి.రవికిరణ్ దర్యాప్తు చేపట్టారు.
వెబ్‌సైట్‌లో పరిచయమైన ‘యువతి’...
అమీర్‌పేట ప్రాంతానికి చెందిన దివాకర్ (78) ఇక్రిశాట్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా పని చేసి పదవీ విరమణ చేశారు. ఈయనకు కొన్ని రోజుల క్రితం ఒక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో ఓ యువతి పరిచయమైంది. వాస్తవానికి ఇతడు పురుషుడే అయి ఉండవచ్చని, యువతిగా చెప్పుకుని ఉండవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. తాను లండన్‌కు చెందిన బ్రిటానియా ఫార్మాస్యూటికల్స్ సంస్థలో పని చేస్తున్నట్లు పరిచయం చేసుకుంది. ఇద్దరూ వాట్సప్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. వీటి ద్వారా కొన్ని రోజుల ఛాటింగ్‌చేసిన తర్వాత తానో పని నిమిత్తం ఇండియాకు వచ్చానని, అది కాకపోవడంతో తిరిగి వెళ్ళిపోతున్నానంటూ సందేశం ఇచ్చింది. ఎందుకు వచ్చావంటూ బాధితుడు ఆరా తీయగా... హెర్బల్ ఉత్పత్తులు తయారు చేయడానికి తమ కంపెనీకి యుసిరిల్ రూట్స్ అనే విత్తనాల అత్యవసరమని వాటి కోసమే వచ్చానంటూ చెప్పింది.
ఆసక్తి ఉంటే వ్యాపారం చేయమంటూ...
తమకు బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ విత్తనాల్ని తక్కువ ధరకు సరఫరా చేస్తుండటాడని, ప్రస్తుతం అతడు అందుబాటులోకి రాకపోవడంతో లండన్ వెళ్ళిపోతున్నానంటూ చెప్పిన యువతి.. ఆసక్తి ఉంటే విత్తుల సరఫరా వ్యాపారం చేసి తమకు సరఫరా చేయాలంటూ ఎర వేసింది. బెంగళూరులోనూ తమ కంపెనీ టెస్టింగ్ సెంటర్ కూడా ఉందని, అక్కడే పరీక్షించి పూర్తి వివరాలు చెప్తారంటూ నమ్మించింది. ఈ వ్యాపారం చేయడానికి దివాకర్ ఆసక్తి చూపడంతో విత్తనాల సరఫరా చేస్తాడంటూ ఓ వ్యక్తి నెంబర్ ఇచ్చింది. దీంతో బాధితుడు ఆ నెంబర్‌లో సంప్రదించగా... శక్తివేల్ అంటూ పరిచయం చేసుకున్నాడు. యుసిరిల్ రూట్స్ 50 గ్రాముల ప్యాకెట్ తాను రూ.23,500కు విక్రయిస్తానని, పరీక్షల తనంతరం వీటిని లండన్ కంపెనీకి 1100 డాలర్లకు అమ్ముకోవచ్చంటూ నమ్మబలికాడు. దీంతో మాజీ వ్యవసాయ శాస్త్రవేత్త అయిన దివాకర్ పూర్తిగా సైబర్ నేరగాళ్ళ వల్లో పడిపోయారు.
నేరుగా బాధితుడిని కలిసిన నేరగాళ్ళు...
ఇలాంటి నేరాల్లో నేరగాళ్ళు ఎక్కడా బాధితులకు నేరుగా కనిపించరు. కేవలం ఫోన్ కాల్స్, ఈ–మెయిల్స్, ఛాటింగ్స్ ద్వారానే టోకరా వేస్తుంటారు. ఇప్పటి వరకు అన్నీ ఈ తరహా కేసులో నమోదయ్యాయి. అయితే తాజా ఉదంతంలో మాత్రం సైబర్ నేరగాళ్ళు బాధితుడిని నేరుగా కలిశారు. దివాకర్‌ను బెంగళూరుకు రమ్మంటూ పిలిపించిన శక్తివేల్ శాంపిల్స్ అంటూ ఐదు ప్యాకెట్లు సిద్ధం చేస్తానన్నాడు. ఇతడి మాటలు నమ్మి బెంగళూరు వెళ్ళిన బాధితుడికి అక్కడి కేఎఫ్‌సీ రెస్టారెంట్‌లో శక్తివేల్ అని చెప్పుకున్న వ్యక్తి కలిశాడు. రూ.1.17 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని ఐదు ప్యాకెట్లు ఇచ్చాడు. లండన్ కంపెనీ ప్రతినిధి జార్జ్‌ని సంప్రదిస్తే టెస్టింగ్స్ చేసిన తర్వాత పూర్తి ఆర్డర్ ఇస్తాడంటూ అతడి నెంబర్ ఇచ్చాడు. దీంతో బాధితుడు జార్జ్‌ని సంప్రదించగా... బెంగళూరులోనే కలిసిన అతగాడు 100 డాలర్లు (రూ.6600) ఇచ్చి టెస్టింగ్ కోసమంటూ ఓ ప్యాకెట్ తీసుకువెళ్ళాడు.
మరికొంత మొత్తం చెల్లించే క్రమంలో...
తమ ల్యాబ్ ముంబైలో ఉందని చెప్పిన జార్జ్ అక్కడకు వెళ్ళి పరీక్షిస్తానంటూ చెప్పాడు. 2–3 రోజులకు కాల్ చేసిన జార్జ్ విత్తుల క్వాలిటీ తమకు సరిపోతుందని తక్షణం 200 ప్యాకెట్లు పంపాలంటూ చెప్పాడు. దీంతో దివాకర్ మళ్ళీ శక్తివేల్‌ను సంప్రదించి ఆర్డర్ ఇవ్వడంతో పాటు అతడు చెప్పిన ఖాతాకు రూ.47 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ నగదు ముట్టిన తర్వాత బాధితుడికి 200 ప్యాకెట్ల విత్తులు పంపాడు. వీటిని సరఫరా చేయడంతో కోసం దివాకర్ ఫోన్ ద్వారా జార్జ్‌ను సంప్రదించాడు. అయితే ప్రస్తుతం తమ కంపెనీ నిబంధనలు మారాయని, కనీసం 300 ప్యాకెట్లు ఉంటేనే తీసుకుంటామని చెప్పాడు. దీంతో బాధితుడు మరో 100 ప్యాకెట్ల ఖరీదు చేయడానికి డబ్బు కోసం బంధువుల వద్ద ప్రయత్నించారు. వారి ద్వారా విషయం బాధితుడి కుమారులకు తెలిసింది. నగదు ఎందుకంటూ వారు దివాకర్‌కు అడగ్గా... విషయం చెప్పాడు. తన తండ్రి నగదు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతా వివరాలు ఆరా తీయగా అవి ఈశాన్య రాష్ట్రాలకు చెందినవిగా తేలింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన కుమారులు తన తండ్రితో సోమవారం సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన ఇన్‌స్పెక్టర్ పి.రవికిరణ్ ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది నైజీరియన్లు చేసిన మోసంగా భావిస్తున్నారు.