తాడిపత్రి ఘటన ఆగేట్లు లేదే?

Update: 2017-12-27 10:30 GMT

అనంతపురం జిల్లాలో వర్గ విభేదాలు ఏ మాత్రం తగ్గలేదు. పార్టీలో గ్రూపు విభేదాలను తగ్గించేందుకు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాలను ప్రతి నెల ఏర్పాటు చేస్తుంది. అనంతపురం జిల్లాలో ఇటీవల ప్రతి నియోజకవర్గంలో గ్రూపు విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. పుట్టపర్తి, తాడిపత్రి, అనంతపురం వంటి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బాహాబాహీకి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఎలా జరుగుతుందోనన్న ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది.

వేడి వేడిగా....

అనంతపురం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి గృహంలో జరిగింది. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీ హాజరయినా అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. ఈ సమావేశానికి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దేవినేని ఉమ, మంత్రులు కాల్వ శ్రీనివాసులు, ఎమ్మల్యేలు, ఎంపీ కిష్టప్ప తదితరులు హాజరయ్యారు. అయితే సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో జిల్లాలో పార్టీకి సహకరించని ఒక అధికారిని బదిలీ చేయాలని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వత్తిడి తెచ్చారు. ఆ అధికారిని బదిలీ చేయకుంటే తాము కార్యకర్తలకు ఎలాంటి సాయం చేయలేమని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు మంత్రి దేవినేని ఉమను కోరారు.

విడి...విడిగా.. ఒకరిపై ఒకరు...

ఇక ఇటీవల తాడిపత్రిలో చోటు చేసుకున్న సంఘటనలు కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే మంత్రులు తెలివిగా తాడిపత్రి సంఘటనపై ఎమ్మెల్యేలతో విడివిడిగా వివరాలు తెలుసుకోవడం విశేషం. ఇటీవల అనంతపురం మేయర్ స్వరూప ఎంపీ జేసీని రాక్షసుడిగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన జేసీఅనుచరుడు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి, మేయర్ స్వరూపకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. దీనిపై మేయర్ స్వరూప తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తన అనుచరుడిని అరెస్ట్ చేస్తారా? అంటూఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేషన్లోనే వీరంగం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో అసలు ఏం జరిగిందన్న దానిపై మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందరి ముందు చర్చ జరిపితే రసాభాస అవుతుందని భావించిన మంత్రులు ఒకరి తర్వాత ఒకరిని పిలిపించి మాట్లాడారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం మేయర్ స్వరూపపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. తన సోదరుడిపై అనవసర వ్యాఖ్యలుచేసిన మేయర్ ఎలా వదిలిపెడతారని ప్రశ్నించారు. దీంతో మంత్రుల జేసీని సముదాయించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా జరిగిన సంఘటను వివరించారు. స్వరూప కూడా మంత్రుల ఎదుట తన వాదనను విన్పించారు. ప్రతి పనికీ జేసీ దివాకర్ రెడ్డి అడ్డుతగులుతున్నారని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరూ రోడ్డున పడవద్దని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని మంత్రులు చెప్పారు. అలాగే శింగనమల నియోజకవర్గానికి నీటిని విడుదల చేయాలంటూ ఎమ్మెల్యే యామిని బాల, ఎమ్మెల్సీ శమంతకమణి కోరారు. మొత్తం అనంతలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం హాట్ హాట్ గా జరిగింది.

Similar News