తలంటితే కాని తెలివి రాలేదే?

Update: 2018-01-26 06:30 GMT

తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర పార్టీ తలంటినట్లుంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి అలుముకున్నా ఇప్పటి వరకూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎలాంటి కార్యాచరణను రూపొందించకపోవడాన్ని తీవ్రంగా అధిష్టానం పరిగణించింది. ప్రతి పనికీ ఢిల్లీ వైపు చూడాలంటే ఎలా అని అక్షింతలు వేసింది. మీకు మీరుగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోలేరా? అధికార పార్టీకి, కాంగ్రెైస్ కు ధీటుగా ఎందుకు కార్యక్రమాలను నిర్వహించడం లేదని మండిపడింది. దీంతో బీజేపీ నేతలకు కొంత నీతి బోధపడింది. తాము ఇప్పటి వరకూ కేంద్ర నాయకత్వం నుంచి కార్యాచరణ వస్తుందేమోనని ఎదురు చూశామంటున్నారు రాష్ట్ర నేతలు.మరో పక్క బీజేపీ నేతలకు వలసల భయం వెంటాడుతూనే ఉంది.

ఉద్యమ కార్యాచరణ సిద్ధం....

సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డిని బుజ్జగించే యత్నాలను ప్రారంభించింది. దీంతో పాటు తెలంగాణ బీజేపీ ఉద్యమాలకు రెడీ అయిపోతోంది. ఇందుకోసం పార్టీతో పాటు అనుబంధ సంఘాలైన మోర్చాలను కూడా ఆందోళనలకు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం మోర్చాల వారీగా సభలు, సమావేశాలను పెట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కార్యక్రమాలను రూపొందించింది. తొలుత మహిళా మోర్చా ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు భద్రత వంటి అంశాలపై మహిళ యుద్ధభేరితో కార్యక్రమాన్ని ప్రకటించింది.

ఇక జనంలోనే....

ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, విద్యార్థి లోకం సమస్యలపై యువగర్జన సదస్సులను ఇప్పటికే ప్రారంభించింది. ఇక రైతు సమస్యలు, ఆత్మహత్యలు, విత్తనాలు, పంటలకు గిట్టుబాటు ధర కోసం రైతు పోరు సభలను ఈ నెల 28వ తేదీ నుంచి ప్రాంరంభించనున్నారు. దీంతో పాటుగా దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, రిజర్వేషన్ల సమస్యలపై దళిత్ ఆదాలత్ పేరుతో రిజర్వడ్ నియోజకవర్గాల్లో కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంది. ఇక బీసీ హక్కలు, సమస్యలపై బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనుంది. ఇప్పటికే బీసీల ఆత్మీయ సమ్మేళనం జహీరాబాద్ లో నిర్వహించారు. ఇక త్రిపుల్ తలాక్, మైనారిటీల రిజర్వేషన్లపై మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను నిర్వహించనుంది. మేడారం పండగను జాతీయ పండగగా గుర్తించాలని కోరుతూ గిరిజన మోర్చా కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమయింది. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయినేతలందరూ హాజరుకావాలని నిర్ణయించారు. విభేదాలను పక్కనపెట్టి అందరూ జనం బాట పట్టాలని నిశ్చయించారు. మొత్తం మీద తలంటితే కాని రాష్ట్ర నేతలకు తెలివిరాలేదన్న వ్యాఖ్యలు కమలం పార్టీలోనే విన్పిస్తున్నాయి.

Similar News