''తమ్ముళ్లూ, ఇది టాప్‌ సీక్రెట్‌ ''.. హెచ్చరించిన చంద్రబాబు

Update: 2016-10-06 12:07 GMT

ఇంతకూ ఏమిటా టాప్‌ సీక్రెట్‌... ప్రత్యేకంగా అసలేమీ లేదు. చంద్రబాబునాయుడు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరికీ వారి వారి ప్రగతి నివేదికలను గురువారం సాయంత్రం అందజేశారు. అమరావతిలో మూడు రోజుల శిక్షణ శిబిరంలో భాగంగా.. చివరిరోజున చంద్రబాబునాయుడు పార్టీ ఎమ్మెల్యేలందరికీ వారి వారి ప్రోగ్రెస్‌ రిపోర్టులను సీల్డు కవర్లలో ఇచ్చారు. ఆ సీల్డు కవర్లను ఎవ్వరికీ చూపించవద్దని చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా చెప్పారు.

తెదేపా ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్‌ రిపోర్టుల బెడద ఉంటుందని శిక్షణ మొదలైనప్పటినుంచి పలువురు మాట్లాడుకుంటూనే ఉన్నారు. తీరా చివరిరోజు ఆ కవర్లు ఇచ్చిన చంద్రబాబు ప్రోగ్రెస్‌ రిపోర్టుల్లోని వివరాల విషయంలో గోప్యత పాటించాలని చెప్పడం విశేషం.

అయినా ఫెయిల్‌ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలు వాటిని గుట్టుచప్పుడు కాకుండా పెట్టుకోవచ్చు గాక.. పనితీరు బవాగా ఉన్నట్లుగా నివేదికల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఏదో ఒక రూపంలో వాటిని అనధికారికంగా లీక్‌ చేయకుండా ఉంటారా అనేది ప్రశ్న. ఎమ్మెల్యేల పనితీరు గురించి ఎవరిది వారు మరియు పార్టీ అధిష్టానం తెలుసుకుంటే సరిపోతుంది గానీ.. మంత్రుల పనితీరు గురించి మాత్రం ప్రజలందరికీ తెలియాలి. కనీసం మంత్రుల వరకైనా.. ఎవరు ఎలా పనిచేస్తున్నారో ప్రజలకు తెలిసేలా తన అధ్యయనం వివరాలను చంద్రబాబు నాయుడు ప్రకటించి ఉంటే బాగుండేదని పలువురు అనుకుంటున్నారు.

Similar News