తమ్ముళ్లకు సీనియర్లు నూరిపోస్తున్నదిదే!

Update: 2017-10-24 05:30 GMT

టీటీడీపీ నేతలు మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెంట ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ సంఘాల నేతలతో సీనియర్ లీడర్లు సమావేశమై పరిస్థితిని పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. కాంగ్రెస్ లోకి వెళితే మహాసముద్రమని, అక్కడ టిక్కెట్లు కూడా దొరకడం కష్టమని నూరిపోస్తున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే రేవంత్ ను నమ్ముకుని వెళ్లొద్దని పార్టీ సీనియర్లు జిల్లా నేతలు, అనుబంధ సంఘాల నేతలకు క్లాస్ లు పీకుతున్నారు. ముఖ్యంగా రేవంత్ వెంట యువ నేతలు ఎక్కువ మంది వెళతారని తెలియడంతో వారితోనే ఎక్కువగా సంప్రదింపులు జరుపుతున్నారు. టీడీపీలో ఉంటే టిక్కెట్ ఖాయమని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు కుదిరితే అధికారంలోకి రావడం జరుగుతుందని ఊరించే కార్యక్రమాన్ని నేతలు స్టార్ట్ చేశారు.

వారిద్దరి పరిస్థిితి ఏమైంది?

అంతేకాదు పార్టీ మారిన నేతల భవిష్యత్ ఏమైందో ఒకసారి చూసుకోవాలని కూడా చెబుతున్నారు. పార్టీలో నెంబర్ 2 గా ఉండే దేవేందర్ గౌడ్ 2009 ఎన్నికలకు ముందు టీడీపీని వీడారు. నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. చివరకు ఆ పార్టీని రద్దు చేసుకుని ప్రజారాజ్యం లో చేరి నవ్వుల పాలయి చివరకు తెలుగుదేశం పార్టీలోకే చేరారన్న విషయాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. అలాగే మంత్రి నాగం జనార్థన్ రెడ్డి టీడీపీకి దూరమై తెలంగాణ నగారా సమితి పేరిట సొంత పార్టీ పెట్టుకుని దాన్ని మూసేసి చివరకు బీజేపలో చేరాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు కావాల్సి వచ్చిందన్నారు. అందుకే వ్యక్తుల బలం ఇందులో లేదని, కేవలం పార్టీని నమ్ముకుంటేనే భవిష్యత్తు ఉంటుందని సీనియర్లు భరోసా ఇస్తున్నారు. దేవేందర్ గౌడ్, నాగం జనార్ధన్ రెడ్డి పార్టీని వీడేటప్పుడు కూడా ఇలాంటి హైప్ ను క్రియేట్ చేశారని, కాని వాళ్లు ఎక్కడా నిలదొక్కుకోలేకపోయారని నూరిపోస్తున్నారు. టీడీపీని నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్ బాగా ఉంటుందని చెబుతూ... రేవంత్ వెంట వెళ్లే వారి సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో పడ్డారు సీనియర్లు. మరి ఈ మైండ్ గేమ్ సత్ఫలితాలనిస్తుందో? లేదో? చూడాలి.

Similar News