తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జయలలిత మరణం తర్వాత పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని తెలిసి అనేకమంది కొత్త పార్టీలతో జనం ముందుకు వస్తున్నారు. వీరిలో కమల్ హాసన్ ముందుండగా... రజనీ తర్వాత ఎంట్రీ అవుతారని తమిళనాడులో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. రజనీకాంత్ గతంలోనే అభిమానులతో సమావేశాలను ఏర్పాటు చేసి తన మనసులో మాటను చెప్పారు. ప్రజలకు సేవ చేయాలన్నది తన అభిమతమన్నారు. ఈ మేరకు రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు కొంతకాలంగా ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బెంగళూరు కు చెందిన ఒక కంపెనీకి పార్టీ చిహ్నం, గుర్తు తయారు చేసే పనిని కూడా అప్పగించారు. ఇక జిల్లాల వారీగా అభిమాన సంఘాలను పార్టీ క్యాడర్ గా మార్చేందుకు కూడా ప్లాన్ సిద్ధం చేశారు.
డిసెంబర్ 12 తలైవా పార్టీ ప్రకటన.....
అయితే తాజాగా కమల్ తన రాజకీయ అరంగేట్రంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జరిగిన తన జన్మదిన వేడుకల్లో తాను రాజీకీయాల్లోకి వస్తున్నట్లు, త్వరలోనే పార్టీని ప్రకటిస్తానని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఎటువంటి ప్రకటన వెలువడ లేదు. అయితే ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీని ప్రకటిస్తారని తమిళనాడులో పెద్దయెత్తున జరుగుతుంది. రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12వ తేదీ. అదేరోజున పార్టీని ప్రకటించేందుకు రజనీకాంత్ సిద్ధమవుతున్నారని తమిళనాడు అంతటా ప్రచారం జరుగుతోంది. అయితే రజనీ, కమల్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే తమిళనాడు స్వీప్ చేస్తారని కొందరు అంటున్నారు. కాని ఇద్దరూ విరుద్ధ స్వభావాలు ఉన్న వ్యక్తులు కావడంతో రాజకీయంగా కలవడం కుదరని పని మరికొందరు తేల్చేస్తున్నారు. మొత్తం మీద తమిళనాడులో మరో ెరెండు బలమైన రాజకీయ పార్టీలు త్వరలోనే ఏర్పాటు కాబోతున్నాయి.