తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత మరణం తరువాత అక్కడి రాజకీయాలే మారిపోయాయి. దేశవ్యాప్తంగా తమిళనాడు పరిణామాలపై అంతా దృష్టి పెట్టె పరిస్థితి నడుస్తుంది. జయ మరణం తరువాత పార్టీ రెండు ముక్కలు కావడం సియం అవుతారనుకున్న శశికళ జైలుబాట పట్టడం. ఏ మాత్రం పట్టు లేకపోయినా కేంద్రంలో తన అధికార బలంతో బిజెపి తమిళ రాజకీయాలను శాసించడం విడిపోయిన ఫళని, పన్నీరులను ఏకం చేయడం తిరుగుబాటు చేసిన దినకరన్ పై కేసులు ఆర్కే నగర్ ఉపఎన్నిక రద్దు , తరువాత నిర్వహించడం ఇలా ఒకటేమిటి అక్కడ సాంబార్ రాజకీయాలు ఎవరికి అర్ధం కానీ రేంజ్ లో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ సినీ స్టార్ విశ్వ నటుడు కమల్ హాసన్ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటన, కొంత గ్యాప్ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ అరంగేట్రం స్పష్టం చేయడం చక చక జరిగిపోయాయి.
కొత్త పార్టీ పెట్టే పనిలో దినకరన్ ....
జయ పార్టీ అన్నా డీఎంకే నుంచి బహిష్కృతుడు అయ్యి ఇటీవలే ఉపఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేసిన శశికళ మేనల్లుడు టిటివి దినకరన్ కొత్త పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆర్కే నగర్ ఉపఎన్నిక గెలిచాకా మూడు నెలల్లో ఫళని ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తా అని ప్రకటించిన దినకరన్ ఆ దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసే పనిలో పడ్డారు. ముందుగా జయలలిత పేరుతోనే ఒక పార్టీ ప్రకటించి ఆ తరువాత సర్కార్ లో వున్న తమ వారిని లాగాలని దినకరన్ స్కెచ్ గీసినట్లు ఆయన వర్గీయుల నుంచి అందుతున్న ఆంతరంగిక సమాచారం. ఒక పక్క సినీ హీరోలు కొత్త పార్టీలు పెట్టె ప్రయత్నాల్లో బిజీ కావడంతో దినకరన్ కూడా తన వ్యూహాలకు పదును పెడుతూ శశి వర్గం కోసం మరో పార్టీని ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు.
రాష్ట్ర పర్యటనకు సిద్ధమైన కమల్ హాసన్...
మరోవైపు పార్టీ కన్నా ముందు రాష్ట్రమంతా పర్యటించేందుకు నటుడు కమల్ హాసన్ ప్లాన్ చేస్తున్నారు. తన బలం బలహీనతలు, ప్రజల మూడ్ వారి సమస్యలు తెలుసుకోవడానికే కమల్ ఈ ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 26వ తేదీన కమల్ కొత్త పార్టీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిగా మారడం విశేషం.