తక్కువ శిక్ష వేయరూ...ప్లీజ్...!

Update: 2018-01-05 17:30 GMT

పశుదాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు జైలు శిక్ష ఖరారు రేపటికి వాయిదా పడింది. ఈ కేసులో గత నెలలో శిక్ష విధించిన కోర్టు...నేడు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. పశుగ్రాసం కుంభకోణం కేసులో లాలూ యాదవ్ గతంలోనే జైలు శిక్ష అనుభవించారు. లాలూ కేసు విచారణకు వస్తున్న సందర్భంగా న్యాయమూర్తికి లాలూ అనుచరుల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే శిక్షను మనసు పెట్టి వేయమని లలూ న్యాయమూర్తిని కోరారు. శిక్షను తగ్గించాలని ఆయన కోరడం విశేషం. జైలులో చలిగా ఉందని లాలూ చెప్పడంతో అయితే తబలా వాయించుకోమని న్యాయమూర్తి సలహా ఇచ్చారు. ఈరోజు కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు వాదనలను వినింది. అయితే రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాలూ శిక్షను ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.

ఆరోగ్యం బాగాలేదంటూ....

తనకు ఆరోగ్యం బాగాల లేదని, సాధ్యమైనంత తక్కువ శిక్ష వేయాలని లాలూ కోర్టును అభ్యర్థించారు. అయితే ఇప్పటికి శిక్షను రెండోసారి వాయిదా వేశారు. ఈనెల 3వ తేదీన శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా న్యాయవాది మరణించడంతో శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే ఈరోజు వాదనలను విన్న న్యాయమూర్తి మరోసారి రేపటికి వాయిదా వేశారు.

కుంభకోణం జరిగిందిలా....

పశువుల దాణా కుంభకోణం కేసు ఇప్పటిది కాదు. 1991 నుంచి 1996 మధ్య కాలంలో ఈ కుంభకోణం జరిగింది. అయితే 1997 అక్టోబరు నెలలో ఈ కుంభకోణంపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాణా కుంభకోణం విలువ మొత్తం 900 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అంతేకాకుండా దేవ్ గడ్ ట్రెజరీ నుంచి లాలూ యాదవ్ 86 లక్షలు డ్రా చేశారన్నది మరొక ఆరోపణ. దీంతో రాంచీ కోర్టు డిసెంబర్ 23న ఈ కేసులో లాలూ యాదవ్ ను దోషిగా నిర్ధారించింది. లాలూతో పాటు మరో పదిహేను మంది పై శిక్ష పడింది. ఇప్పటికే గత నెల 23వ తేదీ నుంచి లాలూ యాదవ్ బిర్సా ముండా జైలులోనే ఉంటున్నారు. జనవరి 3వ తేదీనే లాలూ యాదవ్ కు శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో శిక్షను రేపటికి వాయిదా వేసింది సీబీఐ న్యాయస్థానం.

Similar News