తండ్రిని మించిన తనయుడయ్యాడే

Update: 2018-03-16 17:30 GMT

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలు కెళ్లిన తర్వాత ఆయనపైన సానుభూతి పెరుగుతుందా? ఆయనను అక్రమంగా జైల్లో పెట్టారన్న భావనలో బీహారీలు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ కు ఓటేశారా? అంటే అవుననే అంటున్నారు. లాలూ వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఎప్పుడో ఉన్న కేసును బయటకు తవ్వి మరీ జైల్లోకి పంపారన్నది బీహార్ లో ఎక్కువ శాతం మంది అభిప్రాయపడుతున్నట్లు ఉప ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమైందంటున్నారు.

తేజస్వీ కీలకంగా మారి.....

ఇక బీహార్ లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ విజయం వెనక లాలూ కుమారుడు తేజస్వీయాదవ్ ముఖ్యపాత్ర పోషించారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తేజస్వీయాదవ్ కు గతంలోనే పార్టీ బాధ్యతలను లాలూ అప్పగించారు. అప్పుడు ఆ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకించారు కూడా. అయినా లాలూ మాత్రం తేజస్వికి బాధ్యతలను అప్పగించారు. ఇటీవల జరిగిన అరారియా లోక్ సభ స్థానంతో పాటు జహనాబాద్ అసెంబ్లీ స్థానంలో కూడా లాలూ పార్టీ జయకేతనం ఎగురవేయడానికి కారణం తేజస్వీయేనంటున్నాయి ఆర్జేడీ వర్గాలు.

ప్రచారంలోనూ ప్రత్యేకంగా....

చిన్న వయస్సులోనూ నాయకత్వాన్ని అందుకుని పార్టీని సమర్థంగా నడిపించగలుగుతున్నారని తేజస్వీ యాదవ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అరారియా లోక్ సభ స్థానంలో 60 వేల మెజిరటీ లభించింది. అలాగే జహనాబాద్ అసెంబ్లీస్థానంలో 35 వేల భారీ ఆధిక్యతను సంపాదించింది. బీహార్ లో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ కాలికి బలపం కట్టుకుని తిరిగి మరీ ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీతో చేతులు కలిపారని, తన తండ్రిని అన్యాయంగా జైలుకు పంపారని ఆయన తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించడం విశేషం. లాలూ లాగే తేజస్వీ కూడా సమర్థ నాయకత్వాన్ని పార్టీకి అందించగలరన్న విశ్వాసాన్ని ఆర్జేడీ నేతలు వ్యక్తం చేస్తుండటం విశేషం. నితీష్ కు ధీటైన అభ్యర్థి తేజస్వీయేనంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Similar News