తండ్రికి తగ్గ తనయుడు కాదే...?

Update: 2017-11-20 12:30 GMT

అనుభవమున్న నేత మాట్లాడే తీరు వేరు. అలాగే అనుభవమ లేమి ఎలా మాట్లాడిస్తుందో ఏపీ మంత్రి నారా లోకేష్ ను చూస్తేనే అర్థమవుతుంది. నంది అవార్డుల ఎంపికపై తండ్రి,కొడుకులు చంద్రబాబు, నారా లోకేష్ లు ఇద్దరూ స్పందించారు. కాని లోకేష్ తీరు వేరేలాగా ఉంది. ఆయనకు రాజకీయ పరిపక్వత లేదన్నది వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. లోకేష్ కొత్తగా ఒక పదం కనిపెట్టారు. నాన్ రెసిడెంట్ ఆంధ్ర అనే పదాన్ని వాడారు. ఆంధ్రేతరులు నంది అవార్డుల ఎంపికపై ప్రశ్నించడానికి వీల్లేదట. అలాగే ప్రత్యేక హోదాపై కూడా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారు మాట్లాడకూడదంట. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేని వారు కూడా మాట్లాడితే ఎలా అని లోకేష్ ప్రశ్నించారు. అయితే ఆధార్ కార్డు అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదన్న విషయం లోకేష్ గుర్తించాలి. అలాగే సినీ పరిశ్రమ కూడా ఇంకా విడిపోలేదని, ఆయన మామ బాలయ్య బాబు సినిమాలు రెండు రాష్ట్రాల్లో విడుదల కావడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. నంది అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం జ్యూరీని నియమించింది. జ్యూరీ మాత్రమే ఎంపికపై స్పందించాల్సి ఉంటుంది. ఒకవేళ మీడియా ప్రశ్నించినా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించాల్సి ఉండాల్సింది.

అనుభవం నేర్పిన పాఠం...

అయితే అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన నంది అవార్డులకు కులం రంగు అంటగట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. కళలకు కులాలు ఉంటాయా అని ఆవేదన చెందారు. జ్యూరీ కమిటీ ఎంపిక ప్రకారమే నంది అవార్డులను ప్రకటించాల్సి వచ్చిందని, ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోలేదని చెప్పారు. అంతే తప్ప ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీల గురించి ప్రస్తావన చంద్రబాబు తేలేదు. చంద్రబాబుకున్న రాజకీయ అనుభవమే ఆయన్ను అలా మాట్లాడించింది. కాని లోకేష్ కు రాజకీయంగా అనుభవం లేకపోవడంతో ఆధార్, ఓటర్ కార్డుల ప్రస్తావన తెచ్చారని టీడీపీ వర్గాల్లోనే పెద్దయెత్తున చర్చ నడుస్తోంది. నిజానికి నంది అవార్డుల ఎంపిక రచ్చ రచ్చ అయింది. ఎప్పుడూ బయటకు రాని వారు కూడా మీడియా ముందుకు వచ్చి అవార్డుల ఎంపికను నిరసించారు. ఇందులో తప్పు పట్టాల్సిన పనేమీ లేదు. విమర్శలు సహజం. అయితే దాన్ని తిప్పికొట్టడంలోనే చతురత ఉండాలి. ఆ ఒక్కటీ లోకేష్ కు లేదని అర్థమైపోయింది.

Similar News