‘‘ఢీ‘‘కే బ్యాచ్ కు మింగుడుపడటం లేదే...!

Update: 2018-02-22 10:30 GMT

సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరక ముందే అప్పడే ఆ పార్టీలో చిచ్చురేపుతోంది. నాగం జనార్ధన్ రెడ్డి సీనియర్ లీడర్. ఆయన బీజేపీలో ఇమడలేక పోతున్నారు. అధికార పార్టీ అధినేత కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం ఉధృతంగా చేస్తుండటంతో ఆయన ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల నాగం జనార్థన్ రెడ్డి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఆయన చేరికకు అంతా సిద్ధమయి పోయింది. ఉగాది తర్వాత నాగం జనార్థన్ రెడ్డి హస్తం పార్టీ నేతగా మారబోతున్నారు.

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న....

అయితే ఈ నేపథ్యంలో నాగం చేరికను డీకే అరుణ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నాగం చేరతారన్న వార్తలతో కొంతకాలం క్రితం ఢిల్లీ వెళ్లిన డీకే అరుణ, నందిఎల్లయ్య, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిలు రాహుల్ ను కలిశారు. నాగం జనార్ధన్ రెడ్డిని చేర్చుకుంటే జిల్లా పార్టీలో ఏర్పడే విభేదాలు, తదనంతర పరిణామాలను వివరించారు. అయితే ఆ సమావేశం తర్వాతే నాగం జనార్ధన్ రెడ్డితో కలిసి ఉత్తమ్ రాహుల్ వద్దకు వెళ్లారు. అయితే నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవాలని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నట్లు సమాచారం.

త్వరలోనే నాగం చేరిక.....

డీకే అరుణ బ్యాచ్ రాహుల్ ను కలసి వచ్చిన తర్వాత జైపాల్ రెడ్డి నాగం పార్టీలోకి వస్తే ఏ మేరకు లాభం ఉంటుందో వివరించారు. దీంతో రాహుల్ నాగం చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే డీకే అరుణ వర్గం మాత్రం దీన్ని తీవ్రంగా పరిగనణనలోకి తీసుకుంటోంది. ఇప్పటికే తమ జిల్లాలో రేవంత్ ను చేర్చుకుని తప్పు చేశారని, మరోసారి నాగం ను చేర్చుకుంటే తాము పార్టీలో ఉండాలా? వెళ్లాలా? అన్నది తేల్చుకోవాల్సింది మీరేనంటూ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేయడానికి రెడీ అవుతున్నారు. పీసీసీతో సంబంధం లేకుండా జిల్లా వ్యాప్తంగా నాగం వ్యతిరేకులను కూడగట్టే ప్రయత్నంలో డీకే అనుచరులు ఉన్నారు.

సహకరించబోమంటున్న.....

ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. నాగం క్యాడర్ లేని లీడర్ అని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనను పార్టీలోకి తీసుకురావడాన్ని తాము అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పారు. తామంతా కలిసి రాహుల్ కు చెప్పి వచ్చినా ఆయనను చేర్చుకుంటున్నారంటే తమను లెక్క చేయనట్లే కదా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాము నాగంకు సహకరించబోమని తేల్చి చెప్పారు. నాగం జనార్ధన్ రెడ్డికి, జైపాల్ రెడ్డికి మధ్య అవగాహన ఒప్పందాన్ని తాము త్వరలోనే బయటపెడతామంటున్నారు. మొత్తం మీద చేరికలతో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేగుతుందనే చెప్పొచ్చు. నాగం చేరితే డీకే అరుణ వర్గం పార్టీలో సర్దుకుపోయి ఉంటుందా? లేదా తమ దారి తాము చూసుకుంటుందా? అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.

Similar News